మండలిని రద్దు చేయాలంటే ప్రక్రియ ఏమిటి?

శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా... శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది.

అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చించి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉన్నాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే... ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసిన నేపథ్యంలో...  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది.

అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.