అసెంబ్లీకి వ్యూహం రెడీ... వంశీతో అటాక్ ప్లాన్ చేస్తున్న వైసీపీ

 

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయ భవితవ్యం పై ప్రధానంగా చర్చ జరుగుతోంది. పార్టీ మార్పు అంశానికి సంబంధించి ఎన్నికల తర్వాత తొలి అడుగు వేసిన ఎమ్మెల్యే వంశీ.. తాను వైసీపీలో చేరతానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. టిడిపికి రాజీనామా చేశానని జగన్ తో కలిసి నడుస్తానని వంశీ ప్రకటన చేసిన తర్వాత నుంచి ఆయన ఎప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా అని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇతర పార్టీ ఎమ్మెల్యే.. తమ పార్టీలోకి చేరాలనుకుంటే పదవికి రాజీనామా చేసి రావాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. వంశీ ఎప్పుడు రాజీనామా చేస్తారా అనే విషయం పై చర్చ నడుస్తుంది. 

సీఎం జగన్ తో ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యే వంశీ భేటీ అయ్యారు. తొలిసారి కలిసినప్పుడు కేవలం తాను నియోజకవర్గంలో పరిస్థితులను వివరించడానికి కలిశారని చెప్పారు వంశీ. ఆ తర్వాత టిడిపికి గుడ్ బై చెప్పి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టుగా ప్రకటించి గన్నవరం రాజకీయాలను హీటెక్కించారు. ఆ తరువాత మళ్లీ తన కేడర్ ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లో కొనసాగుతానని.. జగన్ వెంట నడుస్తానని.. మాట మార్చారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. ఆ క్రమంలో సీఎం జగన్ తో వంశీ రెండో సారి భేటీ అయ్యారు. ఈ సారి కూడా పార్టీలో చేరిక రాజీనామా అంశాల పై ప్రధానంగా చర్చ జరిగినట్లుగా సమాచారం. కానీ వంశీ మాత్రం సీఎం సహాయ నిధి కోసం కలిసినట్టు మీడియాకూ చెప్పుకొచ్చారు. జగన్ తో జరిగిన భేటీలో వంశీ రాజీనామా అంశమే ప్రధానంగా చర్చకొచ్చినట్లుగా వైసిపి వర్గాలు అంటున్నాయి. వచ్చే నెల (డిసెంబర్) 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వంశీ అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి.. చంద్రబాబు విషయంలో ఎలా మెలగాలి అనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం వంశీని పార్టీ లోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ రాజీనామా చేస్తే ఆపై పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై లోతైన చర్చ జరుగుతోంది. వైసిపిలో ఇప్పటికే నియోజకవర్గం లో వైసీపీ శ్రేణులు వంశీ రాకను తీవ్రంగా నిరసిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో మాత్రమే వంశీ గట్టెక్కారని విషయాన్ని వైసిపి శ్రేణులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు వంశీని ఇప్పుడే పార్టీలో చేర్చుకోవాలా లేదా కొద్ది సమయం వేచి చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కూడా వైసీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాల కథనం. వంశీ పార్టీ లోకి చేరాలంటే ఖచ్చితంగా రాజీనామా చెయ్యాలి కాబట్టి అలా కాకుండా బయట నుంచి మద్దతు తీసుకుని సరైన సమయంలో రాజీనామా చేయించి అవకాశాలున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.