వలస నాయకులతో ఇంకెంత కాలం బండి లాగిస్తారు బాబు గారు!!

 

2019 సార్వత్రిక ఎన్నికల ఘోర పరాయజంతో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. గెలిచిందే 23 ఎమ్మెల్యేలు అంటే.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ సంఖ్య రెండు ప్లస్ మూడు.. ఐదుకి పడిపోయినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలువురు టీడీపీ నేతలు వైసీపీ, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చేరిపోయారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిసిన వంశీ.. పార్టీ మార్పు అంశంపై త్వరలో ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో ఆయన పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వల్లభనేని వంశీ వైసీపీలో చేరితే గన్నవరం రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశముంది. ఇక్కడ వంశీకి వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడటమే కాకుండా, ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఓ రకంగా వీరి పోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాంటిది ఇప్పుడు వంశీ వైసీపీలో చేరనున్నారని వార్తలు రావడంతో.. యార్లగడ్డ వర్గంలో ఆందోళన మొదలైంది. నియోజకవర్గంలో తాము పట్టు కోల్పోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం వంశీని ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రమ్మన్నారని, రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. మరి వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరితే.. రాజ్యసభకు వెళ్తారా? లేక వైసీపీ గుర్తుపై తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు వంశీ పార్టీ మార్పు వార్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు అలెర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమాని రంగంలోకి దింపిన బాబు.. యార్లగడ్డను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారట. అయితే బాబు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు తప్పుపడుతున్నారు. బాబు ఇంకెప్పుడు మారతారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ అంటే నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీ అని పేరుండేది. ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్నో రంగాలకు చెందిన వారు, మధ్యతరగతి వారు, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాదరణ పొంది మంచి నాయకులుగా పేరుతెచ్చుకున్నారు. టీడీపీ లో నాయకులుగా ఎదిగి ఇతర పార్టీల్లో చేరి మంచి స్థానాల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం.. నాయకులను తయారుచేయటం సంగతి మరిచి, వలస నేతల వెంట పరుగెడుతున్నారు. అధికారంలో ఉన్నపుడు అవసరం కోసం ఎందరో నేతలు టీడీపీలో చేరి, తర్వాత పార్టీని వీడారు. వలస నేతలను నెత్తిన ఎక్కించుకోవద్దని కార్యకర్తలు మొత్తుకుంటున్నా బాబు తీరులో మార్పు కనిపించడంలేదు. వంశీ పార్టీని వీడుతున్నారని వార్తలు రాగానే, యార్లగడ్డతో మంతనాలు మొదలు పెట్టడంతో కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా బాబు తన తీరు మార్చుకోకపోతే పార్టీ పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వలస నేతలతో పబ్బం గడిపి పార్టీ పరిస్థితిని దిగజార్చకుండా.. ధైర్యంగా పోరాడి పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చేలా చేయాలని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వంశీ పొతే ఏంటి? పార్టీనే నమ్ముకొని ఉన్న నిజాయితీపరుడైన కార్యకర్తను నాయకుడిని చేయండి లేదా యువ నాయకుడు నారా లోకేష్ ని బరిలోకి దింపండని కార్యకర్తలు కోరుతున్నారు.

నారా లోకేష్.. మంగళగిరి నుంచి బరిలోకి దిగినప్పుడు.. నియోజకవర్గం ఎంపిక సరైన నిర్ణయం కాదని అప్పట్లోనే కార్యకర్తలు పెదవి విరిచారు. దానికి తగ్గట్టే ఫ్యాన్ గాలికి లోకేష్ కుప్పకూలిపోయారు. అయితే ఇప్పుడు లోకేష్ కి మంచి అవకాశం వచ్చిందని కార్యకర్తలు అంటున్నారు. నిజంగానే లోకేష్ తనని తాను నాయకుడిగా పరిచయం చేసుకోవాలంటే.. ఇదే సరైన సమయమని చెప్తున్నారు. గన్నవరం ప్రజలు ఐతే స్థానికులకు లేదా సౌమ్యులకు పట్టం కడతారు.. మిగతా వారిని పక్కన పెడతారని పేరుంది. అందుకే సౌమ్యుడిగా పేరున్న లోకేష్ గన్నవరం నుంచి పోటీచేసి గెలిస్తే.. అటు పార్టీకి, ఇటు లోకేష్ కి మంచి మైలేజీ వస్తుంది. పార్టీ భవిష్యత్తుకి భరోసా కలుగుతుంది. ఒకవేళ లోకేష్ ఓడిపోయినా.. పోరాట పటిమ కనబరిచారని, కార్యకర్తలు ఆయన వెంట ధైర్యంగా నడిచే అవకాశముంది.

కానీ చంద్రబాబు ఇవేం పట్టించుకోకుండా.. తనకు అలవాటైన దారిలోనే వెళ్తూ.. వలస నాయకుల వెంట పరిగెడితే పార్టీ కోలుకోవడం కష్టమనే అంటున్నారు. బాబుకి రిటైర్మెంట్ టైం వచ్చింది, లోకేష్ పై ఇంతవరకు ప్రజల్లో పూర్తి నమ్మకం కలగలేదు. బాబు ఇంకా అలాగే భయంభయంగా పోరాడితే లోకేష్ పై పడిన పప్పు అనే ముద్ర పోదు. ఇలాంటి సమయంలోనే కార్యకర్తల్లో ధైర్యం నింపేలా లోకేష్ ని బరిలోకి దింపితే.. అటు పార్టీకి, ఇటు లోకేష్ కి మంచిదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు గన్నవరం విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.