సైకిలెక్కుతారా? కాషాయ గూటికి చేరతారా? జేడీ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

జనసేన నుంచి బయటికి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారా‍యణ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తి కలిగిస్తోంది. జనసేనకు రాజీనామా చేసిన తర్వాత, ఆయన తరువాతి అడుగులేంటన్నది ఉత్కంఠ రేపుతోంది. లక్ష్మీనారాయణ ఇప్పటివరకు తన భవష్యత్‌ కార్యాచరణ ప్రకటించలేదు. దాంతో, లక్ష్మీనారాయణ తర్వాతి ప్రస్థానంపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా, ఒకప్పుడు జేడీ మాదిరే సివిల్ సర్వెంట్. ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించి, హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మొన్నటి ఎన్నికల్లో ఆప్‌ విజయఢంకా, లక్ష్మీనారాయణలోనూ ఉత్సాహం నింపిందని అంటున్నారు. దాంతో, కేజ్రీవాల్ తరహాలోనే జేడీ కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ మొదలైంది. కానీ జేడీ సన్నిహితులు మాత్రం, ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. కొత్త పార్టీ పెట్టాలంటే, సమాజంలో ఇమేజ్‌ ఒక్కటే సరిపోదని, ఆర్థిక వనరులు, రాజకీయ నాయకులూ అవసరమంటున్నారు. జేడీ దగ్గర డబ్బుల్లేవంటున్నారు. కేవలం యువతను మాత్రమే ఆయన నమ్ముకున్నారని చెబుతున్నారు. దాంతో, జేడీ... ఏదో ఒక పార్టీలో చేరతారని అంటున్నారు.

అయితే, గత ఎన్నికల్లో లక్ష్మీనారాయణ... టీడీపీలోకి వెళతారన్న ప్రచారాన్ని వైసీపీ ఆయుధంగా మలుచుకుంది. నాడు జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రయోగించిన అస్త్రం లక్ష్మీనారాయణనేనని ఆరోపించారు. దాంతో టీడీపీకి వెళతారనుకున్న లక్ష్మీనారాయణ, లాస్ట్‌ మినిట్‌లో జనసేనలోకి వెళ్లారని అంటారు. ఇప్పడు కూడా టీడీపీకి వెళితే, వైసీపీకి ఆరోపణలకు చిక్కే ప్రమాదమున్నందున, సైకిలెక్కే ఛాన్సే లేదంటున్నారు జేడీ సన్నిహితులు. అయితే, ఆరెస్సెస్ తో సత్సంబంధాలున్న లక్ష్మీనారాయణ... బీజేపీలో చేరతారనే మాట వినిపిస్తోంది. కేంద్ర బడ్జెట్ పై లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించడంతో ఈ ప్రచారం జరుగుతోంది. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీకి, లక్ష్మీనారాయణ లాంటి ఇమేజ్‌ ఉన్న వ్యక్తులు పార్టీలోకి వస్తే బాగుంటుందని ఆలోచిస్తోందని తెలుస్తోంది. దాంతో, కొందరు బీజేపీ నేతలు కూడా లక్ష్మీనారాయణను సంప్రదించారనే ప్రచారం జరుగుతోంది. 

అయితే, పవన్‌లో నిలకడలేదని విమర్శించి, జనసేన నుంచి బయటికి వచ్చిన లక్ష్మీనారాయణ... బీజేపీలో చేరితే కొన్ని ఇబ్బందులూ ఉంటాయంటున్నారు. ఎందుకంటే, పవన్ ఇప్పుడు బీజేపీకి మిత్రుడు. ఏ ఎన్నికలు అయినా బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి. దాంతో, లక్ష్మీనారాయణ... బీజేపీలో చేరితే, ఇబ్బందులే అంటున్నారు. అంతేకాదు, లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకుని ప్రాధాన్యత ఇస్తే, పవన్‌ ఫీలవుతారేమోనని బీజేపీ భావించవచ్చని అంటున్నారు. అందుకే, కాషాయ గూటికి వెళ్లడంపైనా లక్ష్మీనారాయణ ఆచితూచి అడగులేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఒకవేళ, ఇవన్నీ కాదని, లక్ష్మీనారాయణ బీజేపీలో చేరితే, విశాఖ ఎంపీ టికెట్‌ విషయంలో ఇబ్బందులు తప్పవంటున్నారు. ఎందుకంటే, బీజేపీ నుంచి ఆల్రెడీ పురంధేశ్వరి లైన్‌లో ఉన్నారు. అయితే, 2019లో వైజాగ్ నుంచి మంచి ఓట్లు సంపాదించుకున్న లక్ష్మీనారాయణ, అదే సీటుపై ఆశలు పెట్టుకుంటే మాత్రం చిక్కులు తప్పవంటున్నారు. అందుకే బీజేపీలోకి వెళ్లాలనుకున్నా, అనేక అడ్డంకులు మాత్రం కళ్లముందు కదలాడుతున్నాయి. మొత్తానికి, టీడీపీలో చేరితే బాబుతోపాటు లక్ష్మీనారాయణకు ఇబ్బంది. పోనీ, బీజేపీలోకి అంటే, జనసేనతో గొడవ. అలాగని సొంత పార్టీ పెట్టలేరు. సమాజ సేవకు, రాజకీయమే అత్యుత్తమ వేదికని, పదేపదే అంటున్న లక్ష్మీనారాయణ, పాలిటిక్స్‌లో ఉంటానని మాత్రం గట్టిగానే చెబుతున్నారు. కానీ, ఏ పార్టీ అన్న ఆప్షన్స్‌ పరిశీలిస్తే మాత్రం, గందరగోళం కనిపిస్తోంది. క్రాస్‌రోడ్స్‌లో నిలబడ్డ లక్ష్మీనారాయణ, ఎటువైపు అడుగులు వేస్తారన్నది, ఆయనే చెప్పాలి.