13నెలల రెండు రోజుల తర్వాతే జాతీయపతాకం ఎగిరింది

అదే పోరాట స్ఫూర్తి మరోసారి

 

లక్షలాది మంది భారతీయులు ఐక్యగళంతో స్వేచా గీతాన్ని ఆలపించగా బ్రిటిష్ రాజరికవ్యవస్థ తలవంచి వెనుతిరిగింది. స్వాతంత్య్రం కోసం సాగిన శతాబ్దాల పోరాటం ఫలితంగా ఎర్రకోటపై 15ఆగస్టు 1947న త్రివర్ణ పతాకం ఎగిరింది. దేశమంతా సంబురాలు అంబరాన్ని అంటిన వేళ భారతదేశానికి నడిబొడ్డున ఉన్న హైదరబాద్ సంస్థాన ప్రజలు మాత్రం బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరో పోరాటానికి సన్నద్దంగా ఉన్నారు. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బ్రిటిష్ వారు వెళ్ళిపోవడంతో  భారత్ లోనూ, పాకిస్తాన్ లోను కలవకుండా స్వతంత్రంగా ఉంటానంటూ ప్రకటించాడు. అయితే  సంస్థానంలోని ప్రజలు మాత్రం భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. వారి ఆకాంక్ష నెరవేరడానికి హైదరాబాద్ లో జాతీయ పతాకం ఎగరడానికి 13నెలల రెండు రోజులు పట్టింది. మరో స్వాతంత్య్ర పోరాటం అవసరమైంది.

 

ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక రాష్ట్రాల్లోని  కొన్ని జిల్లాలు కలిసి హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. ఇక్కడ కొనసాగే ప్యూడల్ పాలన లో  ఒకవైపు  జాగీర్దార్లు, భూస్వాముల వెట్టి చాకిరి చెరలో గ్రామీణ ప్రజానీకం బానిసలుగా బతికేవారు. మరోవైపు నిజాం అండతో చెలరేగిపోయిన రజాకార్లు  గ్రామాలపై పడి ప్రజలను దోచుకుంటూ వారి ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడేవారు. నిజాం ప్రోద్భలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తానని తన అహంకారాన్ని చాటుకున్నాడు. దాంతో హైదరాబాద్ సంస్థానంలోని పార్టీలు, ప్రజాసంఘాలు నిజాం వ్యతిరేక పోరాటానికి సిద్ధమయ్యాయి. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో కాంగ్రెసు నాయకులు ఉద్యమంలో పాలుపంచుకునారు. ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టగా ఈ సంస్థలన్నింటి పై ఉక్కుపాదం మోపాడు నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్. పోరాడి సాధించుకున్న స్వేచ్ఛాభారతంలో మతఘర్షణలు, ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకపోవడంతో హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. ఆనాటి హోంశాఖ మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నేతృత్వంలో సైనిక చర్య తప్పదని  నిర్ణయించుకున్నారు. దానికి ఆపరేషన్ పోలో, పోలీస్ యాక్షన్ పేరు పెట్టారు. అయితే కేంద్రం తనపై చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోరడంతో పాటు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.. దాంతో పరిస్థితి చేయిదాటి పోతుందన్న విషయం గుర్తించిన కేంద్ర హోం మంత్రి ఆదేశాల మేరకు మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో 13సెప్టెంబర్ 1948న భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. ఎదుర్కొనలేక నిజం నవాబు 17 సెప్టెంబర్ 1948లో భారతదేశంలో విలీనం అవుతున్నానని ప్రకటించి కేంద్ర సైన్యం ముందు నిజాం లొంగిపోయాడు.  దాంతో పోలీస్ యాక్షన్ ఐదు రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. భారత త్రివర్ణ పతాకం హైదరాబాద్ లో రెపరెపలాడింది.  

 

ఆపరేషన్ పోలోలో 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. నిజాం ప్రధానమంత్రి మీర్‌ లాయిక్‌ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. నిజాం 23 సెప్టెంబర్ న ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో ఇచ్చిన తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. హైదరాబాద్ సైనిక గవర్నర్ గా మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి బాధ్యతలు తీసుకున్నారు. 1949 చివరి వరకు చౌదరి సైనిక గవర్నర్ పదవిలో కొనసాగారు.  1950 జనవరిలో సీనియరు ప్రభుత్వ అధికారి ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. ఆ తర్వాత  1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు జరిగియి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

 

ఆ తర్వాత ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగాయి. 17 సెప్టెంబర్ ను ప్రతి ఏటా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా ప్రజాసంఘాలు, పార్టీలు నిర్వహించేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభంలో టిఆర్ఎస్ పార్టీ నేత చంద్రశేఖర్ రావు తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారికంగా విమోచనా దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఎన్నో వేదికలపై చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు వందలాది మంది ఆత్మార్పణ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఎప్పటిమారిదిగానే అధికారం అడినమాట తప్పేలా చేసింది. తెలంగాణ ప్రజలు గత ఏడేండ్లుగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. బిజేపీ నాయకులు తెలంగాణలో ప్రజా యాత్రలు, కాగడాల ప్రదర్శనలు నిర్వహించి మరీ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. అయినా ప్రభుత్వం విమోచనా దినోత్సవం పై ఒక మాటకూడా మాట్లాడలేదు. విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే మజ్లీస్ పార్టీ నుంచి వ్యతిరేకత రావడంతో పాటు వారి ఓటుబ్యాంక్ గల్లంతు అవుతుందన్న ఆలోచనతో టిఆర్ఎస్ మౌనం వహిస్తోంది అన్నది విపక్షాల వాదన.

 

బ్రిటిష్ వారిని వెనక్కి పంపిన ఐక్యమత్యం, నిజాం నవాబును లొంగదీసిన చైతన్యం ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజలను దోచుకుంటున్న నాయకులకు బుద్ధి చెప్పేందుకు మరోసారి ప్రజల్లో రావాలని కోరుకుందాం.