నీకు,నాకు సమానం..వాళ్ళకో రెండు ఇద్దాం..

 

ఉత్తర్‌ప్రదేశ్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీలు(బీఎస్పీ) సిద్ధమయ్యాయి.  ఇందులో భాగంగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈరోజు సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పొత్తు, సీట్ల పంపకాల గురించి ప్రకటన చేశారు. మాయావతి మాట్లాడుతూ.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవానికి దారి తీస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా బీఎస్పీ 38 స్థానాల్లో, ఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్‌ఎల్డీ పార్టీకి రెండు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అమేథి, రాయ్‌బరేలి స్థానాలను కాంగ్రెస్‌ కోసం విడిచిపెట్టినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి బలం లేదని, అందుకే పొత్తు విషయమై వారితో చర్చించలేదని వ్యాఖ్యానించారు.

రెండు జాతీయ పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్‌) యూపీ ప్రజలను మోసం చేశాయని దుయ్యబట్టారు. వీటికి ప్రత్యామ్నాయం కోసం యూపీ ప్రజలు ఎదురుచూస్తున్నారనీ, అందుకే బీఎస్పీ- ఎస్పీ చరిత్రాత్మక పొత్తుకు సిద్ధపడ్డాయని మాయవతి అన్నారు. ‘గతంలో కాంగ్రెస్‌ బోఫోర్స్‌ కుంభకోణం వల్ల అధికారాన్ని కోల్పోతే.. ప్రస్తుతం భాజపా రఫేల్‌ వల్ల అధికారాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ హయాంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే.. ప్రస్తుతం భాజపా పాలనలో అధికారికంగా ప్రకటించకపోయినా అటువంటి పరిస్థితులే నెలకొన్నాయి’ అని ఆమె దుయ్యబట్టారు. 

కోట్లాదిమంది ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ పాలనపై అసంతృప్తిగా ఉన్నారు. రైతులు, నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సమాజంలోని కోట్ల మందిని కాపాడేందుకే ఈ పొత్తు. ఎస్పీ-బీఎస్పీ పొత్తు పేదలు, కార్మికులు, యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల కోసమే’ అని మాయవతి స్పష్టం చేశారు. 1993లో బీఎస్పీ చీఫ్‌ కాన్షీరామ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ కలిసి యూపీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇప్పుడు మేం కూడా అదే స్ఫూర్తితో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.