ఆఫ్ట్రాల్ నువ్వేంది? నీ లెక్కేంది?... మంత్రి వైపు దూసుకెళ్లిన ఉత్తమ్!!

అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కామన్. కొందరు నేతలైతే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ.. కొట్టుకున్నంత పని చేస్తారు. ఇప్పుడీ మాటల యుద్ధం సీన్లు బయట కూడా దర్శనమిస్తున్నాయి. తాజాగా, నల్గొండ కలెక్టరేట్‌లో జరిగిన ఓ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంత? అంటే నువ్వెంత? అంటూ విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో ఒకరిపైకి మరొకరు దూసుకువెళ్లే వరకు వచ్చింది పరిస్థితి.

నియంత్రిత సాగు విధానంపై కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ గురించి వివరిస్తున్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, రైతు రుణమాఫీ కూడా చేస్తున్నామని మాట్లాడుతుండగా.. మధ్యలోనే కల్పించుకున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. ‘నిజంగా రుణ మాఫీ జరిగిందా’ అని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.

వెంటనే స్పందించిన జగదీష్ ‌రెడ్డి.. "మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా?.  మీ పాలనలో కరెంటు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో క్వింటాల్ ధాన్యాన్ని వెయ్యి రూపాయలకే అమ్ముతున్నారు. నీకెంతకావాలో చెప్పు పంపిస్తా" అని బదులివ్వడంతో వివాదం మరింత ముదిరింది. రూ. 1200 కొంటున్నామని ఉత్తమ్ బదులివ్వగా, మీటింగ్‌లో మర్యాద తప్పింది మీరేనని జగదీష్ విరుచుకుపడ్డారు.

"ఇది అసెంబ్లీ కాదని, ఇక్కడ చర్చ జరగడం లేదని అన్నారు. తాను ఏం చెప్పాలనుకున్నానో అదే చెబుతానని, తనకు ఆ హక్కు ఉందని" జగదీష్ తేల్చిచెప్పారు. "గొంతు పెంచుతున్నారు.. గొంతు తగ్గించి మాట్లాడండి" అని ఉత్తమ్ అనడంతో.. "ఆఫ్ట్రాల్ నువ్వేంది? నీ లెక్కేంది?" అంటూ జగదీష్ ఫైర్ అయ్యారు. దీంతో మరింత ఊగిపోయిన ఉత్తమ్.. "నీ లెక్కేంది మరి" అంటూ ఆవేశంగా మంత్రి జగదీష్ వైపు వచ్చారు.

‘‘నువ్వో సీనియర్‌ లీడర్‌వి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచావ్‌. రుణమాఫీ అందలేదా? మా సీఎం లెక్కలతో వివరిస్తుంటే ప్రిపేర్ అయి రాలేదని సభ నుంచి పారిపోలేదా?’’ అని జగదీష్ ఎద్దేవా చేశారు. దానికి బదులుగా ఉత్తమ్.. "నేను ఎక్కడ పారిపోయా? నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావ్‌. నువ్వు మంత్రిగా ఉండటం ఈ జిల్లా దురదృష్టం" అని మండిపడ్డారు. దీనికి జగదీష్.. "నువ్వు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం మీ పార్టీ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు.. ఇదే విషయాన్ని వారే చెబుతున్నారు. " అని కౌంటర్ ఇచ్చారు. చివరగా.. నేను మాట్లాడేది వినండి.. సభా మర్యాద పాటించండి అని మంత్రి జగదీష్ కోరటంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది.