చిరంజీవే ఎందుకు టార్గెట్ అయ్యారు? రాజశేఖర్ గతం మర్చిపోలేదా?

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ‘మా‘ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. చిరంజీవి మాట్లాడుతుండగా పలుమార్లు అడ్డుపడ్డ రాజశేఖర్... పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి మైక్ లాక్కుని... మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో విభేదాలను బయటపెట్టాడు. వేదికపైనున్న అందరి కాళ్లు మొక్కుతూ రాజశేఖర్ వింతగా ప్రవర్తించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కారణంగా తన ఫ్యామిలీలో గొడవులు జరుగుతున్నాయని, తన కారు ప్రమాదానికి కూడా ‘మా‘ గొడవలే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పు ఉన్నప్పుడు... దాన్ని కప్పిపుచ్చేందుకు ఎంత ప్రయత్నించినా పొగ రాకుండా ఆపలేమన్నారు. అయితే, వేదికపైనున్న మోహన్ బాబు, చిరంజీవి, కృష్ణంరాజు, జయసుధ తదితరులు ఆపేందుకు ప్రయత్నించినా తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు రాజశేఖర్.

అయితే, హీరో రాజశేఖర్ తీరుపై మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. మంచిని మైకులో చెబుదాం... చెడుని చెవిలో చెప్పుకుందామని తాను విజ్ఞప్తి చేసినా... రాజశేఖర్ పట్టించుకోలేదని సీరియస్ అయ్యారు. వేదికపైనున్న పెద్దలను రాజశేఖర్ అవమానించారని మండిపడ్డారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో క్రమశిక్షణాసంఘం ఉంటే... రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని చిరంజీవి సూచించారు.

రాజశేఖర్ ప్రవర్తన, వ్యాఖ్యలపై జీవిత క్షమాపణలు చెప్పారు. రాజశేఖర్ ది చంటి పిల్లాడి మనస్తత్వమని, ఆయన ఏదీ దాచుకోడని, మనసుకి ఏదనిపిస్తే అదే మాట్లాడతాడంటూ వాతావరణాన్ని కూల్ చేసేందుకు జీవిత ప్రయత్నించారు. అయితే, చిరంజీవి మాట్లాడుతున్నప్పుడే రాజశేఖర్ అడ్డుపడటం చర్చనీయాంశమైంది. ఎందుకంటే, చిరంజీవి పీఆర్పీని ఏర్పాటు చేసినప్పుడు రాజశేఖర్ కారుపై మెగా ఫ్యాన్స్ రాళ్ల దాడి చేయడంతో ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి-రాజశేఖర్ మళ్లీ కలిసినా.... ఇప్పుడు ‘మా‘ డైరీ ఆవిష్కరణలో చిరంజీవిని మళ్లీ టార్గెట్ చేయడం వెనుక ఏదో గొడవ ఉందంటున్నారు.