మాంత్రికుడి ప్రాణం చిలకలో… పవన్‌కు గండం ఫ్యాన్స్ ఆవేశంలో!

పవన్ భయపడ్డంతా జరిగింది! ఆయన నోరు తెరిచి రచ్చ చేయొద్దని వేడుకున్నా… ఆయన సోకాల్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా యాగీ చేశారు! ఇది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే పదే పదే ఎదురయ్యే సమస్య! ఏం చేయాలో అర్ఝం కాని వ్యవహారం! ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషన్ అయిన జనసేన అధినేత ఫ్యాన్స్ అని చెప్పుకునే వారు చేసే వెటకారాలకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అయినా వారిలో మాత్రం ఆవేశం, ఆలోచన రావటం లేదు… జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి, పెళ్లాల గురించి మాట్లాడాడు. అది తప్పే. కానీ, వెంటనే పవన్ తన అభిమానులకి స్పష్టంగా చెప్పాడు. ఎక్కడా వైఎస్ కుటుంబ సభ్యుల్ని, వారింటిలోని ఆడపడుచుల్ని వివాదంలోకి లాగవద్దని. జనసేనాని ఇంతలా పరిణతి చూపించి పిలుపునిచ్చినా పవనిస్టులు మాత్రం తమ కథ తాము నడిపారు! వైఎస్ జగన్ కుటుంబంలోని ఆడవార్ని కాకుండా ఎవరో కొత్తమ్మాయిని గొడవలోకి లాగారు. ఆమె పేరు అలేఖ్యా ఏంజిల్. ఆమెతో జగన్ వున్న సెల్ఫీ ఫోటోను వైరల్ చేసి శునకానందం పొందారు! ఇదే వద్దని చెప్పారు పవన్. అయినా తమ బుద్ధి పోనిచ్చుకోలేదు ఉన్మాద అభిమానులు…

 

 

పాపం… పవన్ పదే పదే ఇలాంటి ఆవేశపూరిత ఫ్యాన్స్ వల్ల తంటాలు పడాల్సి వస్తోంది. కత్తి మహేష్ విషయంలో గబ్బర్ సింగ్ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాన్ని ఒక విధంగా కత్తి చాలా తెలివిగా వాడుకుని గందరగోళం కూడా సృష్టించారు. ఆ పైన వర్మదీ, శ్రీరెడ్డిది కూడా ఇదే ఫార్మాట్! వాళ్లు పవన్ ని ఏదో అనటం, పవన్ వాళ్లనీ ఏమీ అనకున్నా ఫ్యాన్స్ రెచ్చిపోవటం, చివరకు తలనొప్పి అంతా పవర్ స్టార్ భరించాల్సి రావటం జరుగుతోంది. వపన్ అబిమానులు దుందుడుకు చర్యల వల్ల ఆయన రెండు, మూడు న్యూస్ ఛానల్స్ మ్యానేజ్మెంట్లతో కూడా గొడవపడాల్సిన స్థితి దాపురించింది. ఇక ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ వ్యవహారం కూడా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందే! కందకు లేని దురద అన్న సామెత గుర్తొచ్చేలా పవన్ ఫ్యాన్స్ వదినమ్మని రెండో పెళ్లి చేసుకోవద్దని కలకలం రేపారు. పవన్, రేణు పరస్పర అవగాహనతో విడిపోయినా వీరే తెగ ఫీలయ్యారు!

 

 

వపన్ కళ్యాణ్ అభిమానులు ఇంత కాలం సోషల్ మీడియాలో చేసిన హంగామా వేరు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వుంటూ … జనసేనాని ఓట్ల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో… వీరి ఆగడాలు తీసుకొచ్చే ఫలితాలు వేరు! పవన్ కి ఈ విషయం తెలియదని భావించలేం. కానీ, ఆయన తన అభిమానులని చెప్పుకునే వార్ని ఎలా కంట్రోల్ చేస్తారు? జగన్ వ్యక్తిగత విమర్శల్ని పట్టించుకోవద్దని చెప్పినా కూడా జరగాల్సింది జరిగిపోయింది. అనవసరంగా ఎవరో అలేఖ్యా అనే అమ్మాయి పవన్ అభిమానుల ఆవేశానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆమె ఓ క్రిస్టియన్ గీతాల సీడీ ఆవిష్కరణ కోసం లోటస్ పాండ్ కు వచ్చింది. అదీ తన కుటుంబ సభ్యులతో కలిసి. ఆ సమయంలో ఓ సెల్ఫీ తీసుకుంది. ఇంత చిన్న విషయాన్ని తమ ఇష్టానుసారం రాతలతో సోషల్ మీడీయాలో వైరల్ చేసి ఆనందించారు పవన్ అభిమానులు. దానికి అలేఖ్యా బాధపడి పోస్టు పెట్టింది. తనని బజారుకు లాగొద్దని వేడుకుంది. ట్విస్ట్ ఏంటంటే… తానూ పవన్ అభిమానినేనని చెప్పింది పాపం!

 

 

ఇప్పుడు జగన్, అలేఖ్యాల ఫోటో విషయంలో జరిగిన రచ్చకి పవన్ కారణం కాదు. అలాగే, కత్తి మహేష్, వర్మ, శ్రీరెడ్డి, రేణు దేశాయ్‌ల వ్యవహారాల్లో కూడా! కానీ, జనం ఓట్లు వేయటానికి పోలింగ్ బూత్ కి బయలుదేరేటప్పుడు ఇదంతా ఆలోచించరు. జరిగిన రచ్చని మాత్రమే జ్ఞాపకం పెట్టుకుని ఈవీఎం మెషిన్ పై మీట నొక్కుతారు. కాబట్టి పవన్ సాద్యమైనంత తొందరగా తన అభిమానులు అని చెప్పుకునే వార్ని నియంత్రించటానికి తగిన మార్గం వెతుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడాయన బాక్సాఫీస్ పవర్ స్టార్ కాదు… బ్యాలెట్ బాక్సుల బ్యాటిల్లో నిలిచిన జనసేనాని!