రాజకీయాల్లో నేరస్తులు .... సుప్రీంలో వాదనలు

భారత రాజకీయ వ్యవస్థలో నేరగాళ్ల నిరోధాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కట్టడి చేయనుందా..?. దేశ రాజకీయ వ్యవస్థలో  నానాటికి పెరుగుతున్న నేరగాళ్ల ప్రమేయం సుప్రీం చొరవతో తగ్గనుందా...? దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలలో రౌడీలు, గుండాలు, వివిధ కేసుల్లో కీలకమైన నేరగాళ్లుగా నమోదైన వారు చట్ట సభలలో ఠీవిగా కూర్చుంటున్నారు. ప్రజలకు సంబంధించిన పలు కీలక చట్టాలకు వారు ఆమోద ముద్ర వేస్తున్నారు. ఇది దేశానికి అంత మంచిది కాదు. నేరాలూ, ఘోరాలు వివిధ కుంభకోణాలతో సంబంధం ఉన్నవారు, మహిళలపై అత్యాచారలు చేసిన వారు, భార్యల, బంధువులను హత్య చేసిన కేసులలో ఉన్నవారు చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. వారి ప్రభావంతో కీలకమైన బిల్లుల పాస్ అవుతున్నాయి. అంతే కాదు నేరగాళ్లకు కఠిన శిక్షలు వేసేందుకు రూపొందించిన బిల్లులకు సభలలోకొన్ని ఆమోదం పొందడంలేదు. 

 

 

ఇది దేశానికి క్షేమకరం కాదు. 2014 సంవత్సరం లెక్కల ప్రకారం శాసన కర్తలలో దాదాపు 34 శాతం మందికి నేర చరిత్ర ఉందని వెల్లడయింది. గడచిన నాలుగేళ్లలో ఈ సంఖ్య దాదాపు 10 శాతం పెరిగిందని ఓ అంచన. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్, బిహార్, ప‌శ్చిమ బెంగాల్, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, ఉత్తర‌ప్రదేశ్ స‌హా ప‌లు రాష్ట్రాల నుంచి నేర చ‌రిత్ర ఉన్న వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇది ఆయా రాష్ట్రాల ప్రజ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. పార్లమెంటు, శాసన సభలలో నానాటికి పెరిగిపోతున్న నేరగాళ్లను నిరోదించాలంటూ పబ్లిక్‌ ఇంట్రేస్ట్ ఫౌండేషన్ సంస్థ సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేసింది. దీనిపై ప్రారంభమైన విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో జస్టిస్ ఆర్.ఎఫ్. నారీమన్, జస్టిస్ ఏ.ఎం. ఖన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ‌ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. భారత దేశ న్యాయ, రాజకీయ చరిత్రలో ఇది ఓ మైలురాయి. ప్రభుత్వ న్యాయ‌వాదుల‌కు, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల‌కు మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రిగింది.

 

 

ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు చేసిన వ్యాఖ్యలు కొన్నిదేశ రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతున్నాయి. దేశ రాజ‌కీయ వ్యవ‌స్ధలో నేర చ‌రిత్ర ఉన్న వారి జోక్యం పెర‌గ‌రాద‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు అన్నారు. దీనిపై వారు ఆందోళ‌న వ్యక్తం చేశారు. దేశంలో ఇంతవరకూ రాజకీయాలకు న్యాయస్థానాలకు మధ్య ఎప్పుడూ ఇంతటి వైరం లేదు. ఈ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయ వ్యవస్థకు మచ్చుతునకలు. దేశంలో రాజకీయ వ్యవస్థ నేరపూరితం కాకూడదంటూనే పార్లమెంటు, న్యాయవ్యవస్థల మధ్య ఓ లక్ష్మణరేఖ ఉందని, దాన్ని ఇరువురూ దాటకూడదని సుప్రీం పేర్కొంది. ఈ వ్యాఖ్యలను ఆషామాషీగా చూడకూడదు. అలాగే కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టుల మధ్య వివాదంగానూ  పరిగణించరాదు. గత కొంతకాలంగా కేంద్రం, సుప్రీం ఉప్పూ, నిప్పుగా ఉన్నాయి. రాజకీయాలలో నేరచరితుల పాత్రపై ఈ రెండు వ్యవస్థలు ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. ఈ సందర్భంలో సుప్రీం రాజకీయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకులను కలవర పెడతాయి. అయితే సుప్రీం కనబరచిన తీరును మాత్రం దేశ ప్రజలు హర్షిస్తారు. చట్టసభలలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చేయడంలో నేరగాళ్ల పాత్ర లేకుండా చేసేందుకు సుప్రీం వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొంత వరకూ దోహదపడతాయి. ఇది భారత రాజకీయ వ్యవస్థకు శుభ పరిణామం. భవిష‌్యత్తులో రాజకీయ వ్యవస్థ మరింత బాగుపడడానికి శుభశూచకం. దేశంలో అత్యున్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరు సదా అభినందనీయం. దేశానికి ముందు ముందు మంచిరోజులు వస్తాయనడానికి ఓ నిదర్శనం.