అబ్బ నీ వాల్-మార్ట్ దెబ్బ..యెంత సమ్మగా ఉంది రోయ్య్...దెబ్బా

 

 

నిన్న మొన్నటి వరకు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ యఫ్.డి.ఐ. బిల్లు పాస్ చేయించుకోవడానికి పడరానిపాట్లు పడింది. తిమ్మిని బమ్మిచేసి మొత్తం మీద ఎలాగో ఆ గండం గట్టెక్కి ‘హమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకోనేలోగానే, జాలిలేని విపక్షాలు ఎక్కడో అమెరికాలో వాల్-మార్ట్ అనే కంపెనీవాళ్ళు తమ ప్రభుత్వానికి సమర్పించుకొన్న ‘కంపెనీ ఆడిట్ కాపీలు’ చేతబట్టుకొచ్చి మళ్ళీ సభలో రభస ఆరంబించేసారు. యఫ్.డి.ఐ. బిల్లు దెబ్బకి ఇంకా కోలుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ విపక్షాలు తెచ్చి పెట్టిన ఈకొత్త గొడవకి తల పట్టుకోవలసి వచ్చింది. వాల్-మార్ట్ కూడా బహుళజాతి సంస్తేకావడం, అదికూడా యఫ్.డి.ఐ. సీరియల్ లో బ్రేక్ తరువాత మొదలయిన ఎపిసోడ్ లా కంటిన్యూ అయిపోవడం, మళ్ళీ అదికూడా ఒకవైపు గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న ఈ కీలకతరుణంలోనే మొదలవడం కాంగ్రెస్ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టించింది.

 

“ఈ కుంభకోణాలకి ఇంక అంతే ఉండదా?” అని తానే నివ్వెరపోయేలా ఒకదాని వెనుక ఒకటిగా బయటపడుతున్న ఈ వరుస భాగోతాలనుచూసి కాంగ్రెస్ ఏం చేయాలో, వాటిని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక తల పట్టుకొంది. అయినా, తన పాత అలవాటు ప్రకారం ముందుగా విపక్షాలపై ఎదురుదాడికి దిగింది. వాల్-మార్ట్ ఇటీవల అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన తన ఆడిట్ నివేదికలలో తమ కంపెనీ ఇండియాలో పాగా వేసేందుకు 2008 నుండి ప్రయత్నాలు ఆరంబించినట్లు, అప్పటినుండి 2012 వరకు మొత్తం రూ.120 కోట్లు లాబీయింగ్ (మన బాషలో సంబందిత అధికారులకు లంచాలు మేపడం)కోసం ఖర్చుచేసినట్లు తెలియజేసి ఇక్కడ అగ్గిరాజేసింది. అంతే గాకుండా కేవలం 2012 సం. లోనే 18 కోట్ల రూపాయలు ‘లాబీయింగ్’ కోసం భారత్ దేశంలో ఖర్చుచేసినట్లు కూడా సవివరంగా తమ ప్రభుత్వానికి తెలియజేసింది.

 

అంతే! తుంటిమీద కొడితే మూతిపళ్ళు రాలినట్లు, అమెరికాలో ఆ కంపెనీ సమర్పించుకొన్న ఆడిట్ వివరాలు ఇక్కడ మన పార్లమెంటులో మంటలు రేపాయి. విపక్షాలు పార్లమెంటు కమిటీ వేసి వాల్-మార్ట్ ముడుపుల కేసులో ఎవరెవరు ఎంత బొక్కేసేరో తెలియజేయాలని సభని స్తంబింపజేసాయి. అయితే, చేసిన తప్పుని ఒప్పుకొనే అలవాటు బొత్తిగా లేని కాంగ్రెస్ పార్టీ, యదా విధిగా నోరున్న తన సభ్యులద్వారా విపక్షాల నోళ్ళు నొక్కేయాలని చూసింది. ‘ఈ రోజుల్లో లాబీయింగ్ (లంచాలు) అనేవి చాల మామూలు విషయమే. ప్రపంచంలో అన్ని వ్యాపార సంస్తలు చేస్తున్నావే వాల్-మార్ట్ కూడా భారత్ లో అదేపని చేసింది,” అని వాల్-మార్ట్ మీద ఈగ వాలనీయకుండా చూడాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేసింది పార్లమెంటులో. గానీ, విపక్షాల నోళ్లు మాత్రం మూయించలేకపోయింది.

 

ఇది ఇలా ఉంటె, మరో వైపు అక్కడ గుజరాత్ లో సరిగ్గా ఇప్పుడే ఎన్నికలు ముంచుకొచ్చేయి. పైగా, హైటెక్-నరేంద్రమోడీ తను అసలు ఏ సభలకి రాకపోయినా వచ్చినట్లు ప్రజలని బ్రమింపజేయగల తన సరికొత్త టెక్నాలజీ ‘హలో గ్రాం’ ప్రయోగంతో జనాన్ని అక్కట్టుకొంటూ, ఇక్కడ డిల్లీసభలో సూదిపడిన వెంటనే ఆ ‘సౌండ్’ గుజరాత్ లో తనకి అనుకూలంగా మారుమ్రోగెలా ఉదృతంగా తన ఎన్నికల ప్రచారంలో వాడేసుకొంటునాడు.

 

ఇప్పటికే, మానసికంగా ఓటమికి సిద్దం అయిపోయిన కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు సభలో చేసే ఈ గొడవంతాకూడా ఆ హైటెక్-మోడీ తన కనువుగా ఎక్కడ మార్చేసుకొంటాడో అనే బెంగతో ఒక్కసారిగా మాట మర్చి, “నిజమే! వాల్-మార్ట్ ఇటువంటి లాబీయింగ్ (లంచగొండి వ్యహారాలు) మనదేశంలో కూడా మొదలు పెట్టడం మాకు కూడా చాలభాద కలిగించింది. అందుకే పదవి విరమణ చేసిన ఒక జడ్జితో ఒక కమిటీ నియమించి ఈ విషయంలో విచారణ చేయిస్తాము. ఈ విషయంలో నేరస్తులయిన వారు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కూడా మేము ఉపేక్షించబోము,” అని కొన్ని పడికట్టు పదాలతో సభాముఖంగా నిన్న ప్రకటించింది.

 

ఆ ప్రకటన తో ఓటేయడానికి వెళ్ళబోతున్న గుజరాత్ ప్రజలు అందరూ తన బుట్టలో పడిపోతారని కాంగ్రెస్ పార్టీ ప్రగడ విశ్వాసం. ముందు వాల్-మార్ట్ ని వెనకేసుకొని వచ్చి తరువాత మాట మర్చి కమిటీ వేయడం మాత్రం ప్రజలు గమనించి ఉండరని కాంగ్రెస్ అనుకోవడం పిల్లి పాలు త్రాగుతూ కళ్ళు మూసుకొని తనని ఎవరూ గమనించలేదనుకోన్నట్లు ఉంది.

 

దేశంలో అడుగు పెడుతూనే “అబ్బ నీ వాల్-మార్ట్ దెబ్బ..యెంత సమ్మగా ఉంది రోయ్య్...దెబ్బా’ అని కాంగ్రెస్ చేత పాడించగలిగిందంటే రేపు ప్రజల చేత ఇంకెన్ని ఇటువంటి పాటలు పాడిస్తుందో కదా!