తన పార్టీ రాష్ట్రపతి అభ్యర్థినే ఇందిర ఎందుకు ఓడించారో తెలుసా?

త్వరలో భారతదేశానికి 14వ రాష్ట్రపతి ఎన్నికాబోతున్నారు. రామ్ నాథ్ కోవింద్, మీరా కుమార్ లు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో అధికార పక్షం మద్దతున్న రామ్ నాథ్ కోవింద్ గెలిచే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. దాదాపు ప్రతీసారీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇలాగే జరిగిపోతుంది. ఎన్నిక ముందే ఎవరు గెలుస్తారో అందరికి తెలిసిపోతుంది! కాని, 1969లో మన నాలుగవ రాష్ట్రపతి ఎన్నిక సమయంలో మాత్రం ఎవ్వరూ ఊహించని పరిణామం జరిగింది! అధికార కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఇందిరా గాంధీ కారణంగా ఓడిపోయారు! ఇండిపెండెంట్ గా పోటీ చేసిన క్యాండిడేట్… ఇందిరమ్మ దయతో ప్రథమ పౌరుడైపోయారు!  మరో విచిత్రం ఏంటంటే… ఆ సంవత్సరం ఓడింది, గెలిచింది ఇద్దరూ తెలుగు వారే!

 

1969నాటి కాంగ్రెస్ లో రెండు పవర్ హౌజెస్ వుండేవి. ఇందిరా గాంధీ ప్రధానిగా అత్యంత శక్తివంతురాలిగా చెలామణి అయ్యేవారు. అదే సమయంలో ఆమెకంటే సీనియర్లు, కాంగ్రెస్ పెద్దల నేతృత్వంలో ఏఐసీసీ వుండేది. అంటే… అప్పటికి ఇంకా హస్తం పార్టీ పూర్తిగా గాంధీ కుటుంబం హస్తగతం కాలేదన్నమాట! ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తరుఫున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయటానికి ఏఐసీసీ నీలం సంజీవ రెడ్డిని ఎంపిక చేసింది. ఆయన మన అనంతపురం జిల్లా వాసి!

 

ఏఐసీసీ చేసిన ఎంపిక నచ్చని ఇందిర విభేదించింది. అప్పటికి ఉప రాష్ట్రపతిగా వున్నా వివి గిరి పదవికి రాజీనామా చేసి ప్రెసిడెంట్ గా నామినేషన్ వేశారు! ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయనకు ప్రధాని మద్దతు పలికారు! కాంగ్రెస్ తరుఫున పీఎంగా వున్న ఇందిర తన పార్టీ అభ్యర్థిని కాక ఇండిపెండెంట్ ని సమర్థించారు! అంతే కాదు, తనదైన స్టైల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ ‘మనస్సాక్షి’గా ఓటు వేయమని చెప్పారు!

 

ఇందిర లాంటి శక్తివంతమైన ప్రధాని ఇచ్చిన మనస్సాక్షిగా ఓటు వేయండనే పిలుపుకి … కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు విధేయంగా స్పందించారు! దాని ఫలితమే… చరిత్రలో ఒకే ఒక్కసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు! అలా రాష్ట్రపతి అయిన వివి గిరి కూడా ఒరిస్సాలో పుట్టిన తెలుగు వారే! మొత్తానికి అలా నాలుగువ రాష్ట్రపతి ఎన్నిక కాంగ్రెస్ అధికార అభ్యర్థి కాంగ్రెస్ ప్రధాని కారణంగానే ఓడిపోవటంతో ముగిసింది!