విజయనగరం వైసీపీలో వర్గపోరు... బొత్సకు వ్యతిరేకంగా ఫిర్యాదులు...

విజయనగరం జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి బొత్సకు వర్గపోరు తలనొప్పిగా మారిందట. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య సమన్వయం కరువై ఎవరికి వారు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారట. అలా, జిల్లాలో వర్గపోరు తారాస్థాయికి చేరి, చివరికది సీఎం జగన్ దగ్గర వరకు వెళ్లిందట. అయితే, విషయం తెలుసుకున్న బొత్స... రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

2019 ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకు తొమ్మిది సాధించిన వైసీపీకి, విజయనగరం జిల్లా కంచుకోటగా మారింది. అయితే, మొత్తం తొమ్మిది స్థానాల్లో ఆరు సీట్లను తన కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనుయాయులకు ఇప్పించుకున్న బొత్స... వారందరూ గెలుపొందేలా చూసుకున్నారు. అలాగే, టికెట్లు దక్కనివారిని బుజ్జగించి అందరినీ ఏకతాటిపైకి తేవడంలోనూ బొత్స సక్సెస్ అయ్యారు. అయితే, ఇప్పుడు మళ్లీ జిల్లా నేతల మధ్య విభేదాలు మొదటికొచ్చాయి. గ్రామ వాలంటీర్ల నియామకం విషయంలో మొదలైన విభేదాలు చివరికి గ్రూపు రాజకీయాలకు దారితీశాయి. వాలంటీర్ల నియామకంలో కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మాట చెల్లుబాటు కాకపోవడంతో, వాళ్లంతా మంత్రి బొత్సకు వ్యతిరేకంగా మారారట. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు... స్థానికంగా బొత్సకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు సైతం ఇచ్చారట. అంతేకాదు, బొత్స అంటే పడనివాళ్లంతా ఒక వర్గంగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, జిల్లాలో తనకు వ్యతిరేకంగా కొందరు కార్యకలాపాలు చేస్తున్నారని తెలుసుకున్న బొత్స జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో... వాళ్లందరితో ప్రత్యేకంగా సమావేశమవుతూ, వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కరించడంతో... కొంతవరకు తన వ్యతిరేక వర్గాన్ని శాంతింపజేసినట్లు చెబుతున్నారు. అయితే, బొత్స అంటే గిట్టనివాళ్లు మాత్రం... నివురుగప్పిన నిప్పులా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని విజయనగరం జిల్లా వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.