విటమిన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే..!

కోవిద్ 19 వైరస్ దరిచేరకుండా ఉండాలన్నా.. పాజిటివ్ గా నిర్ణారణ అయినవారు త్వరగా కోలుకోవాలన్నా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని చెప్తున్నారు. విటమిన్ సి, విటమిన్ డి, విటమిని బి12ఇలా అనేక రకాల విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. అయితే అవసరం ఉన్నా లేకపోయినా హెల్త్ సప్లిమెంట్స్ అధికంగా వాడటం వల్ల అనర్థాలు ఎదురవుతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకుండా ఇలా సప్లిమెంట్స్ పై ఆధారపడితే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.

 

విటమిన్లు తగిన ప్రమాణంలో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఉంటుందో, ఎక్కువ ప్రమాణాల్లో కొన్ని విటమిన్లు తీసుకోవటం వల్ల అంతకంటే రెట్టింపు ప్రమాదమూ ఉంటుంది. మన శరీరానికి కావల్సిన విటమిన్లలో వాటర్‌ సాల్యుబుల్‌, ఫ్యాట్‌ సాల్యుబుల్‌...అనే రెండు రకాలుగా ఉంటాయి. బీకాంప్లెక్స్‌ (బి1, బి2, బి6, బి12), విటమిన్‌ సిలు నీటిలో కరిగే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని అధికంగా తీసుకున్నా అవి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. ‘ఎ, డి, ఇ, కె’ విటమిన్లు ఫ్యాట్‌ సాల్యుబుల్‌. ఇవి శరీరంలోని కొవ్వులో చేరి అక్కడే నిల్వ ఉండిపోతాయి. ఈ విటమిన్లు డాక్టర్ సూచనమేరకు మాత్రమే వాడాలి. అవసరం లేకపోయినా  అథిక మోతాదులో లేదా ఎక్కువ రోజులు తీసుకుంటే శరీరంలో టాక్సిసిటీని పెంచుతాయి. ఫ్యాట్‌ సాల్యుబుల్‌ విటమిన్లు అవసరానికి మించి శరీరంలో చేరితే రక్తంలో కాల్షియం స్థాయిలు పెరిగిపోతాయు. ఈ అదనపు కాల్షియాన్ని పేగులు శోషించుకోలేవు. దాంతో కాల్షియం నిల్వలు మూత్రపిండాల్లో చేరి రాళ్లుగా మారతాయి. ఇంతేకాకుండా తీసుకునే సప్లిమెంట్లను బట్టి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే విటమిన్ల వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

 

సహజసిద్ధంగా విటమిన్స్ లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం అన్నివిధాల శ్రేయస్కరం. విటమిన్ సి కోసం సిట్రస్ జాతి పండ్లు, విటమిన్ ఎ కోసం పాలు, పెరుగు, క్యారెట్, బొప్పాయి, విటమిన్ ఇ కోసం బాదం పప్పు ఇలా అనేక ఆహరపదార్థాలను తీసుకోవచ్చు. విటమిన్ డి కావాలంటే మాత్రం రోజూ పొద్దునసాయంత్రం పదినిమిషాల పాటు సూర్యరశ్మి తాకేలా ఆరుబయట నిలబడితే చాలు.