జలుబు రాకూడదా... డి విటమిన్ తీసుకోండి!

 

చలికాలం వచ్చిందంటే చాలు... జలుబు, దగ్గులను మోసుకువస్తుంది. ఆ మూడు నెలలూ ఎలాగొలా గడిపేశాం అనుకోవడానికి లేదు. ఎండాకాలం మొదలవడంతోనే... వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల వల్ల మళ్లీ శ్వాసకోశ వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. అలాంటి పరిస్థితిని సులువుగా ఎదుర్కొనే చిట్కా ఒకటి బయటపడిందని అంటున్నారు పరిశోధకులు.

 
14 దేశాల పరిశోధన:

లండన్లోని ‘క్వీన్ మేరీ విశ్వవిద్యాలయా’నికి చెందిన పరిశోధకులు శ్వాసకోశ వ్యాధులకీ, విటమిన్ ‘డి’కి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధన కోసం భారత్ సహా 14 దేశాలలోని 11 వేలమందిని ఎన్నుకొన్నారు. వీరందరికీ తగు మోతాదుల్లో విటమిన్ డిని అందించి చూశారు. అలా క్రమం తప్పకుండా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకున్నవారిలో ఉదర సంబంధ సమస్యలు తగ్గిపోవడాన్ని గమనించారు.


కారణం:

ఇంతకుముందు విటమిన్ డి లాభాల గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇదేదో సూర్యకాంతి నుంచి లభిస్తుందనీ, శరీరానికి కాల్షియం ఒంటపట్టేందుకు తోడ్పడుతుందని మాత్రమే అనుకునేవారు. కానీ ఒకో పరిశోధనా జరిగేకొద్దీ డి విటమిన్ ప్రాముఖ్యత పెరిగిపోతోంది. డయాబెటిస్ దగ్గర నుంచీ రోగనిరోధక శక్తి వరకూ... శరీరంలోని అణువణువు మీదా విటమిన్ డి ప్రభావం బయటపడుతోంది. ఈ డి విటమిన్ వల్ల ఊపిరితిత్తులలో ‘యాంటీమైక్రోబియల్ పెప్టైడ్స్’ అనే కణాల ఉత్పత్తి మెరుగుపడుతుందట. ఇవి సహజమైన యాంటీబయాటిక్లాగా పనిచేసి... సూక్ష్మక్రిములను సమర్థవంతంగా ఎదుర్కొటాయట.

 
ప్రభావం అసమానం:

విటమిన్ డి వల్ల ప్రయోజనం ఉంది అని మాత్రమే చెప్పి ఊరుకోవడం లేదు శాస్త్రవేత్తలు. ఒక ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అది ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో... విటమిన్ డి తీసుకున్నప్పుడు కూడా అంతే ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. దగ్గు, జలుబు వంటి సమస్యలే కాకుండా... ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడే ఆస్తమా వంటి తీవ్రమైన సమస్యలలో కూడా విటమిన్ డి అద్భుతం చేసినట్లు కనుగొన్నారు.


అదీ సంగతి! జలుబు వల్ల పెద్దగా ప్రమాదం లేదని మనం భావించవచ్చు. కానీ అదే జలుబు ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. 2013లో న్యూమోనియా బారిన పడి ఏకంగా 26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారంటే... శ్వాసకోశ వ్యాధులు ఎంత ప్రమాదకరమైనవో అర్థమైపోతోంది. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు కఫసంబంధమైన వ్యాధులతో పడే బాధ వర్ణనాతీతం. ఆరోగ్యవంతులైన వారు కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడి విలువైన పనిగంటలు వృధా చేసుకుంటూ, వైద్యానికి డబ్బులు ఖర్చుపెట్టుకుంటూ గడపాల్సిన పరిస్థితి. ఇక ఈ బాధలన్నింటికీ విటమిన్ డి సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తవహించడమే తరుణాపాయం అంటున్నారు.

 

- నిర్జర.