వీసాల… ఆయాసాలు!

 

హైద్రాబాద్లోని చిలుకూరు బాలాజీ దేనికి ఫేమస్సో తెలుసుగా? ఆయనని ఒక దశలో వీసాల వేంకటేశ్వరుడని విపరీతంగా ఆరాధించే వారు యువత! ఇప్పటికీ నమ్మకం వున్న వారు శ్రద్ధగా పూజిస్తున్నారు. శ్రద్ధ వున్న వార్నీ ఆయన కూడా చక్కగా ఆదుకుంటున్నాడు! అయితే, వీసాల విషయంలో మాత్రం రోజు రోజుకి పరిస్థితి దారుణంగా తయారవుతోంది! చిలుకూరు బాలాజీ దేవుడు వరమిచ్చినా…. ట్రంపు అనే పూజారి వరమివ్వటం లేదు! కరువులో వాంతిలాగా ట్రంప్ లాగే మారిపోతున్నారు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బ్రిటన్ పాలకులు కూడా!

 

అసలు గత కొన్ని దశాబ్దాలుగా ఇండియాలో ఒక అవమానకర ట్రెండ్ విజృంభిస్తోంది! మనకు పర్సనల్ గా అదొక పెద్ద గర్వకారణం కావచ్చు…. కాని, మన దేశం వారు విదేశాలకు వెళ్లి నానా తిప్పలు పడి డాలర్లు పోగేయటం… మన దుస్థితిని చూపిస్తుంది. అదే ఇంతకాలం కొనసాగింది. ఇక్కడ ప్రజల సొమ్ముతో ప్రభుత్వాలు అందించిన విద్య అభ్యసించి…సరైన అవకాశాలు లేక వలసలు పోతున్నారు. మా వాడు అమెరికాలో స్థిరపడ్డాడని మనం గొప్పగా చెప్పుకున్నా… భారతదేశానికి మాత్రం అది హానికరం, అవమానకరం!

 

ఇక ఇప్పుడు… మంచికో, చెడుకోగాని… మన బెస్ట్ బ్రెయిన్స్ ని ఇంతకాలం చౌకగా వాడేసుకున్న వెస్టన్ కంట్రీస్ అలా చేయమంటున్నాయి. వీసాలు జారీ చేసే విషయంలో రోజు రోజుకి రూల్స్ కఠినతరం చేస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ ఈ ట్రెండ్ కి తెర తీసినా తరువాత అతడ్ని సైలెంట్ గా ఫాలో అవుతున్నాయి మరికొన్ని దేశాలు. ఎవరు పడితే వారు ఇండియా నుంచి తమ తమ దేశాలకు కారు చౌకగా వచ్చేయకుండా నియమాలు సవరిస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాల పాలకులు! ఈ టీమ్ లో లేటెస్ట్ గా చేరింది న్యూజీలాండ్!

 

కివీ దేశంలో మొత్తం జనాభానే 48లక్షలు! అందుకే, వలస వచ్చిన భారతీయులకి మంచి అవకాశాలే ఇచ్చేది ఆ దేశం. కాని, రాను రాను అక్కడ వలస వచ్చిన వారి సంఖ్య 71వేలు దాటిపోవటంతో ఆందోళన మొదలైంది! న్యూజీలాండ్ ఫస్ట్ నినాదం ఊపందుకుంది. ఇప్పుడు అక్కడ కూడా అమెరికాలో మాదిరిగానే మినిమం సాలరీ లెవల్ భారీగా పెంచేశారు. లోకల్ న్యూజీలాండ్ ఉద్యోగిని పెట్టుకుంటే ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ పే చేస్తే తప్ప బయటి వారిని పెట్టుకోలేకుండా చేసేశారు. అదే ఇప్పుడు ఇండియన్స్ కి ఇబ్బందిగా మారనుంది!

 

న్యూజీలాండ్ పక్కనే వుండే ఆస్ట్రేలియా కూడా ఆల్రెడీ వీసాలు విరివిగా ఇచ్చే విషయంలో వేషాలు వేస్తోంది. గతంలోలా ఈజీగా ఇచ్చేయమని , ఆ రూలని, ఈ రూలని మాటలు చెబుతోంది. అన్నిటి సారాంశం ఒక్కటే. నిజమైన దమ్మున్న ఇండియన్స్ మాత్రమే ఇక మీద ఆస్ట్రేలియాలో కాలుపెట్టగలరు!

 

అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పాటూ ఇప్పటికే భారతీయులకి డోర్స్ క్లోజ్ చేసిన మరో దేశం బ్రిటన్! గాంధీ, నెహ్రూల కాలం నుంచీ మనోళ్లు బ్రిటన్ వెళుతూనే వున్నారు. కాని, ప్రస్తుతం అక్కడి ఎడ్యుకేషన్ , వర్క్ వీసాల పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేనంత టఫ్ గా మారిపోయింది. సాదాసీదా ఇండియన్స్ లండన్ డ్రీమ్స్ మర్చిపోవటమే బెటర్!

 

అమెరికా నుంచీ ఆస్ట్రేలియా దాకా అందరూ ఇండియన్స్ కి నో ఛాన్స్ అనటానికి కారణం ఏంటి? ఏం లేదు… ఆయా దేశాల్లో వలస ఉద్యోగులు పెరిపోతున్నారు. దాని వల్ల లోకల్ చంటిగాళ్లకు మంటపుడుతోంది. ప్రజాస్వామ్య దేశాల్లో ఓట్లు అవసరం కాబట్టి లోకల్ వాళ్లని ఎవరు మాత్రం రెచ్చగొడతారు! అందుకే, ట్రంప్ లాగే అందరూ అవుట్ సైడర్స్ ముఖాలపై గేట్లు వేసేస్తున్నారు! అయితే, ఇక్కడే ఇండియా పాలకులు గమనించాల్సింది… ఇండియన్స్ లో హైలీ స్కిల్డ్ వారికి మాత్రం ఇప్పటికీ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బ్రిటన్… అన్నీ స్వాగతం పలుకుతూనే వున్నాయి! అంటే… మన దేశంలోని అత్యున్నత జ్ఞానాన్ని అవ్వి వాడుకోటానికి రెడీనే అన్నమాట!

 

నిజానికి నేషన్ ఫస్ట్ అన్నది ప్రపంచంలో … ఫస్ట్ మన మోదీనే! ఆయన ఇండియా ఫస్ట్ అన్నాకే … చాలా దేశాల్లో ఈ ఫస్ట్ నినాదాలు ఊపందుకున్నాయి! కాబట్టి మోదీ సర్కార్ ఈ క్లిష్ట పరిస్థితిని సవాల్ గా తీసుకుని మన దేశంలోని అత్యున్నత మేధస్సుకి బయటకి వెళ్లే ఛాన్స్ ఇవ్వకూడదు! అమెరికా లాంటి దేశాలు మన మామూలు మెదళ్లను వద్దని గొప్ప తెలివి వున్న వారికి మాత్రం గాలం వేస్తున్నాయి. అలా జరగనివ్వకుండా… మన దేశం కూడా ఇండియా ఫస్ట్ నినాదంతో దూసుకుపోవాలి. దేశం కాని దేశంలో శ్రీనివాస్ కూచిభోట్ల లాగా ఎవరు మాత్రం దురదృష్టకరంగా అసువులు బాయాలనుకుంటారు? అందుకే, మన దేశం ముందు మన వారికి అద్బుతమైన అవకాశాలు కల్పించాలి! అప్పుడు వీసాల ఆయాసాలు వుండవు. భారతదేశమూ వెలిగిపోతుంది!

 

ఇండియాలో నిరుద్యోగ సమస్య అంత తేలిగ్గా తీరిపోయే సమస్య కాదు. అయినా ఏదో ఒక క్షణం నుంచీ కంకణం కట్టుకుంటే సాధించలేనిది ఏముంటుంది? అభివృద్ధి చెందిన దేశాలకు చెలగాటం… మనకు ప్రాణ సంకటం అన్నట్టు ఎంత కాలం నెట్టుకొస్తాం? ఆలోచించుకోవాలి!