కోహ్లీ వరల్డ్ రికార్డు.. సచిన్ ని వెనక్కి నెట్టేశాడు!!

 

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 20,000 పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త రికార్డు నమోదుచేశాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా కోహ్లీ  20 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌లో హోల్డర్‌ బౌలింగ్‌లో నాలుగో బంతికి సింగిల్‌ రాబట్టి.. కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. కోహ్లీ కేవలం 417 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా పేరిట ఉంది. సచిన్, లారా ఇద్దరూ 453 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత అందుకున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల పరుగులు పూర్తి చేసిన 12వ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కాగా, సచిన్ 34,357), రాహుల్ ద్రవిడ్‌(24,208) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్ కోహ్లీనే కావడం మరో విశేషం. కోహ్లీ ఇప్పటి వరకు 417 ఇన్నింగ్స్‌ ఆడాడు. టెస్టుల్లో 131‌, వన్డేల్లో 224, టీ20ల్లో 62 ఇన్నింగ్స్‌ ఆడాడు.