ఇస్రో మరో గుడ్ న్యూస్.. విక్రమ్ సేఫ్!!

 

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలం అయ్యిందని నిరాశ చెందిన వేళ విక్రమ్ ల్యాండర్ ఆచూకీ దొరకడంతో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. అయితే చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ చేసిన విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయ్యిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ చేసిన విక్రమ్ తాజా పరిస్థితిపై ఇస్రో కీలక ప్రకటన చేసింది. అంతా భావించినట్టు విక్రమ్ ల్యాండర్  ముక్కలవలేదని ఇస్రో తెలిపింది. ప్ర‌జ్ఞాన్ రోవర్.. ల్యాండర్ లోపలే ఉన్నట్టు పేర్కొంది. అయితే నిర్దేశిత ల్యాండింగ్ ప్రాంతానికి కొద్ది దూరంలో, విక్రమ్ ఓ పక్కకి ఒరిగి ఉన్నట్టు తెలిపింది. ల్యాండర్‌తో కమ్యునికేషన్‌ను పునరుద్ధరించేందుకు శాస్త్రవేత్తలు ప్రస్తుతం తీవ్రంగా కృషి చేస్తున్నారు.

కాగా.. విక్రమ్ ఒక పక్కకు ఒరిగి ఉండటంతో.. కమ్యునికేషన్‌ను పునురుద్ధరించేందుకు వీలుగా ఎంటినాలు సరైన దిశలో ఉన్నాయాలేదా అనే అంశంపై ఇంకా సంగ్ధితత నెలకొంది. ల్యాండర్‌లోని విద్యుత్ వ్యవస్థపై కూడా ఇంక స్పష్టత రాలేదు. కమ్యునికేషన్ పునరుద్ధరించేందుకు ఎంటీనాలు సరైన దిశలో ఉండటం అత్యావశ్యకం అని  ఓ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. 'ల్యాండర్‌లో ప్రతి వ్యవస్థా క్షేమంగా ఉంటేనే కమ్యునికేషన్ పునరుద్ధరించడం సాధ్యపడుతుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కాకపోవడం వలన ఆ ఆవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి' అని మరో శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.