క్షుద్రపూజలా? తోటకూర కట్టా?

 

విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో క్షుద్ర పూజలు జరిగాయని, లోకేష్‌ని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఈ పూజలు జరిగాయని వైసీపీ నాయకులు గొంతు చించుకుని అరుస్తున్నారు. వీళ్ళ ధోరణిని చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా దాన్ని ముఖ్యమంత్రికి ఆపాదించి, దురుద్దేశాలు పులిమి రచ్చ చేయడం జగన్ పార్టీకి మామూలైపోయింది. జనం నోళ్ళలో నానడానికి ఇంతకంటే మంచి మార్గం వీళ్ళకి కనిపిస్తున్నట్టు లేదు. అసలు కనకదుర్గ దేవాలయంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తే పదవులు వచ్చేస్తాయని ఎక్కడైనా రాసి వుందా? గతంలో ఎప్పుడైనా ఎవరైనా అలా చేసినట్టు దాఖలాలు ఏవైనా వున్నాయా? లేకపోతే సాక్షాత్తూ కనకదుర్గమ్మే వైసీపీ నాయకుల కలలోకి వచ్చి చెప్పిందా? నిజంగానే తమకు దుర్గమ్మ కలలోకి వచ్చి ఇదంతా చెప్పిందని వైసీపీ నాయకులు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

 

కనకదుర్గ గుడిలో వేళకాని వేళలో ఏవో పూజలు జరిగాయని అంటున్నారు. గుడి ఇ.ఓ. ప్రమేయం కూడా ఇందులో వుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరుగుతోంది. అసలు విషయం  త్వరలోనే తేలుతుంది. అయితే ఇంతలోనే వైసీపీ నాయకులు ఈ ఇష్యూని తమకు అనుకూలంగా మలచుకోవాలని తెగ తంటాలు పడిపోతున్నారు. దుర్గమ్మకి క్షుద్రపూజలు చేస్తే ముఖ్యమంత్రి అయిపోయేమాట నిజమే అయితే ఈపాటికి ఎవరో కాదు.. సాక్షాత్తూ వై.ఎస్.జగనే ఆ కార్యక్రమం కానిచ్చేసి వుండేవారని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన ఏ క్షుద్రపూజలు చేస్తే అయ్యారో జగన్ పార్టీవాళ్ళే చెప్పాలి. ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కాలంటే ప్రజల్లో బలం వుండాలి. ప్రజల నమ్మకం పొందాలి. అంతే తప్ప మంత్రాలకి చింతకాయలు రాలవన్నట్టుగా క్షుద్రపూజలు చేస్తే ముఖ్యమంత్రులు అయిపోరు. అయినా ముఖ్యమంత్రి అవ్వాలన్న ఉద్దేశంతో తన గుడిలో క్షుద్రపూజలు ఎవరైనా చేయిస్తే దుర్గమ్మ చూస్తూ ఊరుకోదు.. వాళ్ళకు తగిన శాస్తి చేసి తీరుతుంది. అంతేకాదు.. తన గుడిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నవారిని కూడా క్షమించదు.