వైసీపీలో విజయసాయి రచ్చ.. కేసుల కోసమేనా! 

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు మద్దతిస్తూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పచ్చి దళారీలా వ్యవహరిస్తుందన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై వైసీపీలోనే వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం బిల్లుకు సపోర్ట్ చేసే క్రమంలో కాంగ్రెస్ ను ఉద్దేశించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని వైసీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారట. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు, ప్రధాని నరేంద్ర మోడీకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేసే ఉద్దేశం మంచిదే అయినా.. విజయసాయి రెడ్డి కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విజయసాయి ప్రకటన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లో ఇబ్బందిగా మారబోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

 

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయ సాధనే తమ లక్ష్యమని వైసీపీ చెబుతోంది. సీఎం ఎక్కడిక్కెల్లినా.. ఏ సభలో మాట్లాడిన వైఎస్సార్ పేరు ఎత్తకుండా ఉండరు. జగన్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నింటికి వైఎస్సారే పేరు పెట్టారు. అయితే వైఎస్సార్ రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ తోనే గడిచింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటప్పుడు వైఎస్సార్ ఆశయాలతో నడుస్తున్నామని చెప్పుకుంటున్న పార్టీ నేత.. కాంగ్రెస్ పార్టీని దళారీతో పోల్చడం చర్చగా మారింది. కాంగ్రెస్ పార్టీ దళారీలా ఉంటే.. వైఎస్సార్ కూడా దళారీ పార్టీ నుంచే సీఎం అయ్యారా అన్న ప్రశ్నను కొందరు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో నేతల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసినవారే. వైఎస్ తో కలిసి కాంగ్రెస్ లో కీలక పదవులు నిర్వహించిన వారే. కాంగ్రెస్ లో ఎదిగిన నేతలంతా ఇప్పుడు విజయసాయి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారని సమాచారం. బహిరంగంగా తమ అభిప్రాయం చెప్పకపోయినా.. సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. 
 

కేంద్రం ప్రభుత్వానికి అన్ని అంశాల్లోనూ వైసీపీ మద్దతు ఇస్తోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్థికే ఓటేశారు వైసీపీ ఎంపీలు. కొన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తున్న విద్యుత్ బిల్లును కూడా జగన్ పార్టీ సమర్ధించింది. ఇప్పుడు వ్యవసాయ బిల్లులకు సపోర్ట్ చేసింది. జగన్ పై సీబీఐ, ఈడీ కేసులు ఉండటంతో.. వాటి నుంచి తప్పించుకునేందుకే వైసీపీ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులకు సంబంధించిన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ఇటీవలే సీరియస్ గా స్పందించింది. త్వరలోనే ఈ కేసులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో అంతలోపే తమపై ఉన్న కేసులను కొలిక్కి తెచ్చుకోవాలని సీఎం జగన్, విజయసాయి భావిస్తున్నారని, అందులో భాగంగానే బీజేపీని మరింత మచ్చిక చేసుకునేందుకు విజయసాయి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ పెద్దల ప్రసన్నం కోసమే విజయసాయి రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ను దళారీ అంటున్న వైసీపీ నేతలు.. కాంగ్రెస్ నుంచి సీఎంగా ఎదిగిన వైఎస్సార్ పేరు వాడుకోవడం మానాలని, ధమ్ముంటే వైఎస్సార్ ఫోటో లేకుండా జనంలోకి వెళ్లాలని డిమాండ్  చేస్తున్నారు. 

 

వ్యవసాయ బిల్లుల విషయంలో అధికార బీజేపీ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తోన్న వైసీపీ.. లోక్ సభ మాదిరిగానే రాజ్యసభలోనూ బిల్లులకు మద్దతు తెలిపింది. అంతటితో ఊరుకోకుండా.. బీజేపీకి వత్తాసు పలుకుతూ విపక్షాలపై వైసీపీ ఎదురుదాడి చేసింది. వ్యవసాయ బిల్లులను అడ్డుకుంటోన్న కాంగ్రెస్, ఇతర విపక్షాలను ఉద్దేశించి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నదని.. బిల్లుల్ని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సరైన కారణమే లేదు. అది పచ్చిగా దళారీలాగా వ్యవహరిస్తున్నదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయి వ్యాఖ్యలను రాజ్యసభలోనే కాంగ్రెస్ ఖండించింది.