లోకేష్ ఒక కోడిగుడ్డు అందించారు! విజయసాయి ఈకలు పీకారు!

కోడి గుడ్డు మీద ఈకలు పీకటం… ఈ సామెతకు తగిన న్యాయం చేయటం కోసం మన దేశంలో చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అందులో ముందు వరసలో వుంటారు ఏపీ ప్రతిపక్ష నేతలు! మరీ ముఖ్యంగా, జగన్ తరువాత పార్టీలో నెంబర్ టూ అంటూ చెప్పుకునే మన A2 విజయసాయి రెడ్డివారు! ఆయన వృత్తి రిత్యా ఉన్నతమైన చదువుతో చార్టెడ్ అకౌంటెంట్ అయినా పాలిటిక్స్ లో మాత్రం ఊర మాస్ అన్నట్టుగా వ్యవహరిస్తారు. పెద్దల సభలో సభ్యుడుగా వుండి కూడా విమర్శల దగ్గరికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నారో తెలియనంత పూనకంతో ఊగిపోతారు! ఇందుకు ఇంత కాలం చంద్రబాబు టార్గెట్ గా వుండే వారు. తాజాగా విజయసాయి రెడ్డి హిట్ లిస్ట్ కొత్త వారొచ్చి చేరుతున్నారు. యధావిధిగా చంద్రబాబు తనయుడు లోకేష్ ఎలాగూ బాధితుడు అయ్యారు!

 

 

 

విజయసాయి రెడ్డి తొందరపాటు మాటలు ఎలా వుంటాయో తెలియాలంటే ఆయన ఈ మధ్య రాజ్యసభలో చేసిన హంగామా గుర్తు చేసుకోవాలి! ఆయన నేరుగా రాజ్యసభ చైర్మన్నే టార్గెట్ చేశారు. మన తెలుగు వాడు, దశాబ్దాలుగా వివాద రహిత రాజకీయం చేస్తోన్న కాషాయ నేత … వెంకయ్య నాయుడుని ఆడిపోసుకున్నారు. ఆయన సభాపతిగా తనకు అన్యాయం చేశారట. తగినంత సమయం మాట్లాడేందుకు ఇవ్వటం లేదని నిండు సభలో ముఖం మీదే చెప్పేశారు! అసలు అలాంటి పదవిలో వున్న వారిపై అలా మాట్లాడవచ్చా? నిజంగా అలా దిగజారి ప్రవర్తించే వ్యక్తేనా వెంకయ్య? ఇవేవీ విజయసాయి పట్టించుకోలేదు!

 

వెంకయ్య నాయుడ్ని నానా మాటలు అందరి ముందూ అనేశాక … తీరిగ్గా ఆయన కార్యాలయంలోకి వెళ్లి సారీ చెప్పేశారు విజయసాయి! కానీ, వ్యవహారం సద్దుమణగకపోవటంతో తెల్లారి మళ్లీ సభలో విజయసాయి తన పరుషమైన మాటలకి వివరణ ఇచ్చుకున్నారు. కానీ, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పటం లేదని గ్రహించిన వెంకయ్య అతడ్ని అలా వదిలేసి తరువాతి కార్యక్రమంలోకి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. సభాపతికి మరింత ఆగ్రహం కలిగిందని గ్రహించిన విజయసాయి ఇక చేసేది లేక బేషరతుగా సారీ చెప్పి కూర్చున్నారు! అసలు ఇంత రచ్చ ఎందుకు జరిగింది? విజయసాయి వారికి నోటిపై అదుపు లేక! ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాక మరోసారి ఆయన తన నైజం బయటపెట్టుకున్నారు!

ఇంకా సరైన రాజధాని లేని నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు ఒక్క యేడు ఒక్కో ప్రాంతంలో జెండా వందనం చేస్తున్నారు. ఈసారి శ్రీకాకుళంలో బాబు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులు కూడా ఎవరికి వీలైన చోట వారు జాతీయ జెండా ఆవిష్కరించారు. పాపం విజయసాయి రెడ్డి ఆయన ఎక్కడ జెండా వందనం చేశారోగానీ టీవీల్లో టీడీపీ నాయకుల కార్యక్రమాలన్నీ తీరిగ్గా లైవ్ చూసి వుంటారు! చంద్రబాబు మొదలు ఏ చిన్న నాయకుడి కార్యక్రమంలోనూ ఆయనకు కోడిగుడ్డుగానీ, ఈకలు దొరకలేదు! సో… లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. ట్విట్టర్ లో తాను సేకరించిన ఈకల్ని జనం ముందు ఉంచారు!

 

 

లోకేష్ తన ఇంటిపైనే జెండా వందనం చేశారు. పోలీసు వందనం కూడా అక్కడే స్వీకరించారు. ఇది అధికార దుర్వినియోగం అంటూ సెలవిచ్చారు విజయసాయి రెడ్డి! దీంట్లో లాజిక్ ఏంటో ఆయనకే తెలియాలి. అసలు జెండా వందనం చేయకపోతే తప్పుగానీ గౌరవంగా ఏదో ఒక చోట చేస్తే తప్పేంటి? పోనీ ఆయన ముఖ్యమంత్రి కాదు కదా? మరి ఆయన ప్రత్యేకంగా ఎక్కడ జెండా వందనం చేయాలి అని రాజ్యాంగం చెప్పిందా? అలాంటిదేం లేదే! మరెందుకు విజయసాయి రెడ్డి వారికి ఆవేశం? రాష్ట్ర విభజన జరిగాక ఒక్కసారి మనం అటు తెలంగాణలోకి తొంగి చూస్తే… సీఎం కేసీఆర్ ప్రతీ ఏటా గోల్కొండ కోటపై నుంచీ జెండా వందనం చేస్తున్నారు! అలాంటి శాశ్వత సౌకర్యం ఏపీకి లేదు! ఇదీ విజయసాయి బాధపడాల్సిన విషయం! అమరావతి ఎంత త్వరగా పూర్తవుతే అంత ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఆయన చెబితే , సూచిస్తే బావుండేది. అలా కాకుండా లోకేష్ అనుకోకుండా అందించిన ఓ కోడిగుడ్డు పట్టుకుని దానిపై ఈకలు పీకటం… ఆయనకే చెల్లింది!