ఏపీలో ఎన్నికలు..టీడీపీతో టీఆర్ఎస్ ఢీ

 

తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు కూటమి తరుపున ప్రచారం చేయటం తెలంగాణ సీఎం కేసీఆర్ కి నచ్చలేదో ఏమో? ..ఏపీ రాజకీయాల్లో వేలుపెడతాం, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని అన్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్ రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించటమే. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అవ్వటమే ఇందుకు ఉదాహరణ. పైకి ఫెడరల్ ఫ్రంట్ పైనే చర్చించాం అని చెప్తున్నా..ఏపీ రాజకీయాలపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు ఏపీలో ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోలేదని అటు టీఆర్ఎస్,ఇటు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.

తాజాగా టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఓడించేందుకు తమ పార్టీ ఎంపీలు ఏపీలో ప్రచారం చేస్తారని వెల్లడించారు. కేటీఆర్, జగన్ భేటీ కేవలం ఫెడరల్ ఫ్రంట్ కోసమేనని, ఇందులో మరేతర విషయాలు లేవన్నారు. ఫ్రంట్ వెనుక బీజేపీ ఉందన్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలన్న నినాదాన్ని ఎన్నికల ముందే కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అందులో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ అనేక మందిని కలిశారని, జగన్‌తో భేటీ కూడా అందులో భాగంగానే ఈ భేటీ అని ఆయన స్పష్టం చేశారు. జగన్ ఏమైనా అంటరానివాడా? ఆయన ఓ ప్రతిపక్ష నేత అని ఆయన తెలిపారు. జగన్‌తో కేటీఆర్ భేటీ అయితే టీడీపీకి ఎందుకింత ఉలికి పాటు? తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు పర్యటించలేదా? అని సీతారాం నాయక్ ప్రశ్నించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భేటీపై స్పందించారు. తాజాగా అయన మీడియాతో మాట్లాడుతూ...వైఎస్‌ జగన్‌, కేటీఆర్‌లు ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చలు జరిపారన్నారు. త్వరలో కేసీఆరే స్వయంగా వైఎస్‌ జగన్‌తో చర్చలు జరుపుతారని తెలిపారు. రాష్ట్రాల హక్కు కోసం కేంద్రంతో పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్‌ ఫ్రంట్‌ నిలుస్తుందని, ఇది ఒక్క టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీది మాత్రమే కాదన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయదని, అభ్యర్థులను నిలపదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ ప్రాంతీయ పార్టీలైతే భాగమవుతాయో.. వారికి మద్దతుగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.