లోన్ల రూపంలో… జనం డబ్బుతో… ‘ఆటలాడుకున్నాడు’!

ఒక్క వ్యక్తి… కేవలం ఒకే ఒక్క వ్యక్తి… ఇటు అధికార బీజేపీని, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ని కూడా ఇబ్బంది పెట్టగలగటం మాటలు కాదు. కానీ, ఆ పని విజయవంతంగా చేశాడు విజయ్ మాల్యా. కాంగ్రెస్ కాలంలో అప్పులు చేసి బీజేపీ పాలనలో దర్జాగా లండన్లో మకాం వేశాడు. ఇప్పుడు రెండూ పార్టీలు మాల్యా కేసులో పాపమంతా మీదంటే మీదని దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే, మోదీ సర్కార్ మాత్రం కింగ్ ఫిషర్ కింగ్ తమపై తీసుకొచ్చిన ఆరోపణల్ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంతోంది. బ్రిటన్ కోర్టులో ఇవాళ్ల తుది వాదనల అనంతరం మాల్యా ఇండియాకు వస్తాడా లేదా తేలిపోతుంది. అయితే, ఇప్పటికే విజయ్ మాల్యాకు తన సీన్ ఏంటో అర్థమైపోయినట్టు కనిపిస్తోంది. ఆయనని భారత్ కు అప్పగించటానికే బ్రిటన్ కోర్టు ఆదేశించవచ్చు.

 

 

చాలా సింపుల్ గా మాట్లాడుకుంటే విజయ్ మాల్యా 9వేల కోట్లు వివిధ బ్యాంకుల వద్ద అప్పు చేసి ఎగ్గొట్టాడు. పారిపోయి బ్రిటన్ లో రాజసం వెలగబెడుతున్నాడు. అయితే, ఇప్పుడు సీబీఐ కేసు వేసి కోర్టుకి లాగటం వల్ల మాల్యా తిరిగి రాక తప్పకపోవచ్చు. ఇక్కడికి వచ్చాక ఇంకా బోలెడు తతంగం వుంటుంది. కానీ, ముందైతే ఆయన ఇండియాలో దిగీ దిగగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అది చాలు బీజేపీ వారికి. ఎందుకంటే, మాల్యా దేశం వదిలి పారిపోయేలా మోదీ సర్కార్ సహకరించిందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. దాన్ని తిప్పికొట్టడానికి మాల్యా కొన్ని రోజులో, కొన్ని గంటలో జైల్లో వున్నా చాలు! కానీ, అసలుగా ఆయన చేసిన ఘనకార్యాలకు శిక్షపడిదే ఎప్పుడో మూలన పడ్డ కింగ్ ఫిషర్ విమానాలకే తెలియాలి!

 

 

విజయ్ మాల్యా లాంటి కార్పొరేట్ అవినీతి మొసళ్లు మన వ్యవస్థలోని లోపాల్ని ఆసరా చేసుకునే బతికేస్తుంటాయి. ఈ బెంగుళురు బుల్లోడు బాలీవుడ్ భామలతో ఫోటోషూట్ లు, గోవా బీచుల్లో క్యాలెండర్ గాళ్స్ తో సరసాలు తెగ సాగించాడు. అదంతా బాగానే వర్కవుట్ అయినా అసలు సమస్య మనోడి విపరీత తెలివితేటల్తో వచ్చింది. కింగ్ ఫిషర్ కంపెనీ పేరుతో హ్యాపీగా బీర్లు అమ్ముకున్న మాల్యా అక్కడితో ఆగక విమానాలు నడిపే సంస్థ ప్రారంభించాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాల్లోకి పోయింది. అందుకు కారణం మాల్యా ఎయిర్ హోస్టెస్ ల మీద పెట్టిన శ్రద్ధ పెట్టుబడులు, రాబడుల మీద పెట్టకపోవటమే. అది పక్కన పెడితే ఇంకా చాలా ఆర్దిక అరాచకాలు చేశాడంటున్నాయి జాతీయ మీడియా సంస్థలు. తాజాగా ఓ ఛానల్ వారు మాల్యా ఈమెయిల్స్ బట్టబయలు చేశారు. వాటిల్లో కింగ్ ఫిషర్ కంపెనీ ఉన్నతాధికారులతో మాల్యా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు.

 

 

మాల్యా ఈమెయిల్స్ సారాంశం ఏంటంటే… ఇక్కడి బ్యాంకుల వద్ద కింగ్ పిషర్ విమానాల కోసమని అప్పులు చేసి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ , ఫోర్స్ వన్ రేసింగ్ టీమ్ లకు డబ్బులు మళ్లించటం. క్రికెట్ లో, రేసింగ్ లో టీమ్ లు కొని వాట్ని పోషించటానికి జనం డబ్బుతో నడిచే బ్యాంకులకి టోపి పెట్టాడన్నమాట. ఇలా అయిదు వందల కోట్లు విదేశాలకు పంపి అక్కడ్నుంచీ తన క్రికెట్ టీమ్ కు, కార్ రేసింగ్ టీమ్ కు చెల్లింపులు చేశాడట. వాటి మీద లాభం ఏముంటుంది? అందుకే డబ్బులు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయాయి!

 

మాల్యా లాగా కార్పోరేట్ మోసాలు చేసి విదేశాలకు పారిపోయే బాపతు నేరస్థులకి కఠిన శిక్షలు పడేలాగా మోదీ సర్కార్ కొత్త బిల్లు తెచ్చింది. అయితే, దాన్ని ఎంత వరకూ మన పాలకులు నిజాయితీగా అమలు చేస్తారన్నది సమస్య! అదే జరిగితే మాల్యా మొదలు నీరవ్ మోదీలు, జగన్మోహన్ రెడ్డీలు అందరూ తగిన ఫలితం అనుభవిస్తారు. కానీ, అలాంటి సూచనలు మన వ్యవస్థలో తక్కువే!