భయపడ్డారా..? పారిపోయారా..?


 

తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించిన కమెడియన్ విజయ్‌సాయి ఆత్మహత్య కేసు పూటకో మలుపు తిరుగుతోంది. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని క్షణాల ముందు విజయ్‌సాయి తీసుకున్న రెండు వీడియో సెల్ఫీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన చావుకు భార్య వనితతో పాటు శశిధర్, లాయర్ శ్రీనివాస్‌లే కారణమని.. వారి టార్చర్ భరించలేకే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నానని స్పష్టం చేశాడు. విజయ్‌ తండ్రి సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదులోనూ ఈ ముగ్గురి పేర్లు పేర్కొనడంతో.. వారిని విచారించాలని పోలీసులు నిర్ణయించారు.. అయితే ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. విజయ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాతి రోజు నుంచి ఈ ముగ్గురు కనిపించడం లేదట.. ఇదే విషయాన్ని పోలీసులు కూడా చెబుతున్నారట. వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆమె నివాసానికి వెళ్లగా... ఆ సమయంలో ఆమె తల్లి మాత్రమే ఇంట్లో ఉంది.. వనితను ఫోన్ ద్వారా సంప్రదించగా.. తాను సూర్యాపేటలో ఉన్నానని.. తన కుమార్తెకు అనారోగ్యంగా ఉందని.. తానే పోలీస్ స్టేషన్‌కు వస్తానని చెప్పినట్లు సమాచారం. మరోవైపు లాయర్ శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లారట.. ఆయన ఫోన్ అందుబాటులో లేకపోవడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శ్రీనివాస్ ఆచూకీ గుర్తిస్తున్నారట పోలీసులు. మరోవైపు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న నవయుగ కనస్ట్రక్షన్స్ డైరెక్టర్ శశిధర్‌కి.. ఇందులో ఎంతవరకు ప్రమేయం ఉందన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు పోలీసులకు భయపడ్డారా లేక.. తమ వేధింపులే విజయ్‌ను ఆత్మహత్య వైపుకు నడిపించాయని భావించి పరారయ్యారా అంటూ కృష్ణానగర్‌ పరిసర ప్రాంతాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.