విజయ్‌ మాల్యా సంచలన నిర్ణయం

 

పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయినట్లు విజయ్‌ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాలు నయా పైసాతో సహా తిరిగి చెల్లిస్తానని విజయ్ మాల్యా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2016లో మాల్యా దేశం విడిచి లండన్‌ వెళ్లిపోయారు. అయితే అతడిపై మనీలాండరింగ్‌ కింద కేసు నమోదవడంతో గతేడాది లండన్‌ పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న మాల్యా.. భారత్‌లో కోర్టు అధీనంలో ఉన్న తన ఆస్తులను ఇచ్చేస్తే వాటిని విక్రయించి బకాయిలు చెల్లిస్తానని గతంలో పలుసార్లు చెప్పారు. అయితే దర్యాప్తు సంస్థలు అందుకు అంగీకరించలేదు. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై అక్కడి వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై న్యాయస్థానం తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మాల్యా వరుస ట్వీట్లలో తెలిపారు.

‘బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని పారిపోయానని, నేను ఓ ఎగవేతదారునని మీడియా, రాజకీయ నాయకులు పదేపదే చెబుతున్నారు. ఇదంతా అబద్ధం. రుణాల చెల్లింపుల కోసం కర్ణాటక హైకోర్టు ముందు నేను రాజీ ప్రస్తావన తెచ్చాను. దాని గురించి ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు’ అని మాల్యా ట్వీట్‌ చేశారు.‘‘ఏటీఎఫ్ ధరలు అధికంగా ఉన్న కారణంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడినమాట వాస్తవమే. బ్యారెల్‌కు 140 డాలర్ల మేర అత్యధిక క్రూడాయిల్ ధరలు ఎదుర్కొన్న అద్భుతమైన విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్. విపరీతమైన నష్టాల కారణంగా బ్యాంకుల సొమ్ము ఖర్చయిపోయింది. వాళ్లకు 100 శాతం అసలు మొత్తాన్ని ఇస్తానని చెప్పాను. దయచేసి తీసుకోండి..’’.

"మూడు దశాబ్దాల పాటు భారత్‌లోనే అతిపెద్ద మద్యం విక్రయాల సంస్థగా పేరొంది దేశ ఖజానాకు రూ. వేల కోట్లు ఇచ్చాం. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా కూడా రాష్ట్రాలకు చాలా మొత్తమే చెల్లించాం. బాగా నడిచిన ఎయిర్‌లైన్‌ నష్టాల్లో కూరుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. అయినా కూడా ఇప్పటికే నేను డబ్బు చెల్లిస్తాననే చెబుతున్నా. ఎందుకంటే అది ప్రజల డబ్బు. దయచేసి ఆ బకాయిలు తీసుకోవాలని బ్యాంకులు, ప్రభుత్వాన్ని కోరుతున్నా" అని మాల్యా మరికొన్ని ట్వీట్లు చేశారు.