పాత పాటే పాడిన మాల్యా...

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎంచక్కా విదేశాల్లో దాక్కున్న కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా కు ఏం తెలియదంట.. తాను బ్యాంకులకు ఎలాంటి నష్టం చేయలేదంట. ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు... మాల్యా.. మాల్యా తరపు వాదిస్తున్న న్యాయవాది చెపుతున్న మాటలు. మాల్యా ను భారత్ కు రప్పించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. లండన్ లోని వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో మాల్యా అప్పగింతపై వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మాల్యా రుణాలు ఎప్పుడు, ఎలా తీసుకుని ఎలా ఖర్చు పెట్టారన్న విషయాన్ని ఈడీ, సీబీఐ అధికారుల తరఫు ప్రాసిక్యూషన్ సవివరంగా చెబుతున్న సమయంలో, మాల్యా తరపు న్యాయవాది మధ్యలో కలుగజేసుకొని... తమ క్లయింట్ ఏ ఒక్క రూపాయిని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదని, అవి ఓ కంపెనీ పేరిట తీసుకున్నవని వాదిస్తూనే, ఆయన ఎవరినీ మోసం చేయలేదని అన్నారు. కింగ్ ఫిషర్ కోసం రుణాలు తీసుకోక ముందు, ఆ తరువాత క్రూడాయిల్ ధరలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు పెరిగిన తీరు, ఈ రంగంలో నెలకొన్న పోటీని వివరిస్తూ, తన వ్యాపారం విఫలమైందని, తానే ఎంతో నష్టపోయానని చెప్పించారు. వ్యాపారంలో నష్టాలు వస్తే తానేం చేయగలనని వాదించారు. ఇక మాల్యా కూడా ఎప్పటిలాగే.. ఇండియాలోని ఏ ఒక్క బ్యాంకును కూడా తాను మోసం చేయలేదని పాత పాట పాడారు.