వీడియో గేమ్స్‌తో లాభమా? నష్టమా?

 

వీడియో గేమ్స్‌ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! వాటి జోలికి పోకుండా ఉండాలే కానీ... ఒక్కసారి కనుక అలవాటుపడితే ఏ వ్యసనానికీ తగ్గకుండా మనల్ని పట్టేసుకుంటాయి. ఒకప్పుడు వీడియోగేమ్స్ అంటే పెద్ద తతంగంలా ఉండేవి. ప్లే స్టేషన్లతోనో, కంప్యూటర్ల మీదో ఆడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్ల పుణ్యమా అని ఎవరైనా ఎప్పుడైనా వీడియోగేమ్‌లోకి దూరిపోవచ్చు.

 

వీడియోగేమ్‌లను ఆడేతీరు సులువైన కొద్దీ వాడకందారులు కూడా ఎక్కువైపోతున్నారు. ప్రస్తుతానికి 35 ఏళ్ల సగటు వ్యక్తి కూడా వీడియోగేమ్స్‌ ఆడుతున్నట్లు ఓ పరిశోధనలో బయటపడింది. ఇంతకీ వీడియోగేమ్స్‌ వల్ల మన మెదడు మీద ఏదన్నా ప్రభావం ఉంటుందా అన్న సందేహం రావడం సహజమే! దీని మీద చాలా పరిశోధనలే వెలువడ్డాయి. కాకపోతే ఒకో పరిశోధనదీ ఒకో తీరు. వీడియోగేమ్స్‌తో మన ఏకాగ్రతలో అద్భుతమైన మార్పులు వస్తాయని కొన్ని పరిశోధనలు తేలిస్తే... అవి ఒక వ్యసనంలా మారిపోయి జీవితాల్ని ఛిద్రం చేస్తాయని మరికొన్ని పరిశోధనలు తేల్చాయి. దీంతో జనం మరింత అయోమయానికి గురవతున్నారు.

 

ఇంతకీ వీడియోగేమ్స్‌తో మన మెదడు మీద కలిగే ప్రభావం ఏమిటంటూ కొందరు పరిశోధకులు తేల్చి పారేయాలనుకున్నారు. ఇందుకోసం ఇప్పటివరకూ ఈ రంగంలో జరిగిన 116 పరిశోధనల ఫలితాలను ఓ తాటికి తీసుకువచ్చారు. వాటిలో 22 ప్రయోగాలు ఏకంగా మెదడు మీద జరిగినవే!

 

వీడియోగేమ్స్‌ ఆడటం వల్ల మన మెదడు పనితీరే మారిపోతుందని ఈ నివేదికలో స్పష్టం అయ్యింది. ఈ గేమ్స్‌ ఆడటం వల్ల మన ఏకాగ్రతలో స్పష్టమైన మార్పులు వస్తాయని తేలింది. ఏ విషయం మీద కావాలంటే ఆ విషయం మీద, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఏకాగ్రతని నిలిపిఉంచే నైపుణ్యం వస్తుందట. వస్తువుల ఆకారాలని స్పష్టంగా గుర్తించగలిగే visuospatial skills కూడా మెరుగుపడతాయట. అసలు ఏకంగా మెదడులో ఉండే హిప్పోకేంపస్‌ అనే భాగం పెరగడాన్ని కూడా గమనించారు. జ్ఞాపకవక్తిని పదిలంగా ఉంచడంలో ఈ హిప్పోకేంపస్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

 

మరోవైపు వీడియోగేమ్స్ ఒక వ్యసనంలా మారిపోయే ప్రమాదం కూడా ఉందని స్పష్టమైంది. తరచూ వీటిలో మునిగిపోవడం వల్ల ‘Internet gaming disorder’ అనే వ్యాధికి లోనవుతారట. నిరంతరం వీడియోగేమ్స్‌ ఆడకపోతే జీవితంలో ఏదో వెలితి ఉన్నట్లుగా బాధపడటం, భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం, ఊహలలో తేలిపోవడం, ఒంటరిగా గడపడం.... లాంటి లక్షణాలన్నీ ఈ వ్యాధితో పాటుగా వస్తాయి.

 

వీడియోగేమ్స్‌తో అటు సానుకూల ప్రభావం, ఇటు ప్రతికూలత... రెండూ ఉంటాయని తేలిపోయింది. కాబట్టి, వాటికి మన జీవితంలో ఏమేరకు అవకాశం ఇవ్వాలన్నది ఇక మన ముందున్న నిర్ణయమ!

- నిర్జర