బౌన్స‌ర్లను పెట్టి.. ఉద్యోగుల చేత రాజీనామాలు

 

సాప్ట్  వేరు జాబ్ ఉంటే చాలు... లైఫ్ సెటిల్ అయిపోనట్టే అనుకుంటారు. ఎన్ని కష్టాలు పడైనా సరే సాఫ్ట్ వేర్ లో జాబ్ సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఇక నానా కష్టాలు పడి తెచ్చుకున్న ఉద్యోగం పోతే ఎలా ఉంటుంది. ఏదో పని సరిగ్గా చేయట్లేదనో... ఇంకేదో కారణం చెప్పి ఉద్యోగాలనుండి తప్పిస్తే ఓకే. కానీ ఓ ఐటీ కంపెనీలో మాత్రం దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బౌన్స‌ర్లను పెట్టి బలవంతంగా ఉద్యోగుల చేత రాజీనామాలు చేయించారు.  ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు..ఏకంగా 200 మంది ఉద్యోగుల‌ను తొలగించారు. ఇక బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

 

ఆ ఫిర్యాదు ప్ర‌కారం.. మాదాపూర్ ఐటీ కారిడార్ లో ఉన్న వెరిజాన్ కంపెనీ యాజ‌మాన్యం 2017 డిసెంబ‌ర్ 12, 13 తేదీల్లో మీటింగ్ రూమ్ కు ఉద్యోగుల‌ను ఒక్కొక్క‌రిగా పిలిపించింది. అప్ప‌టికే ఆ గ‌దిలో బౌన్స‌ర్లు, హెచ్ ఆర్ మేనేజ‌ర్ సిద్ధంగా ఉన్నారు. ప్రింటెండ్ పేప‌ర్లు ఉద్యోగుల ముందుంచి రాజీనామా చేస్తున్న‌ట్టు సంతకాలు చేయాల‌ని యాజ‌మాన్యం కోరింది. ఉద్యోగులు కొంత స‌మ‌యం కావాల‌ని కోర‌గా…హెచ్ ఆర్ మేనేజ్ మెంట్ నిరాక‌రించింది. రిజైన్ లెట‌ర్స్ పై సంత‌కాలు చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని తేల్చిచెబుతూ బౌన్స‌ర్ల‌కు సైగ‌లు చేసింది. కొందరు ఉద్యోగులు సీట్ల‌లోనుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా..బౌన్స‌ర్లు వారిని వెళ్ల‌నీకుండా అడ్డుకున్నారు. ఉద్యోగులను మాన‌సికంగా, భౌతికంగా హింసించి రాజీనామా ప‌త్రాల‌పై సంత‌కాలు తీసుకొని బయటకు పంపేశారు. దీంతో ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు కంపెనీ యాజ‌మాన్యం వాటిని ధ్వంసం చేసే అవ‌కాశ‌ముంద‌ని, ఈ లోగానే ఫుటేజీని స్వాధీనం చేసుకుని ప‌రిశీలించాల‌ని పోలీసుల‌ను కోరారు. దీంతో పోలీసులు ఆ కంపెనీపై సెక్ష‌న్ 506 క్రిమిన‌ల్ త‌ర‌హా బెదిరింపులు, సెక్ష‌న్ 341 అమానుష ప్ర‌వ‌ర్త‌న కింద కేసు న‌మోదుచేశారు.