వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం.. వాస్తవం ఏంటంటే?

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ముంబయి తలోజా జైలు సిబ్బంది ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారని వస్తున్న వార్తలపై.. వరవరరావు అల్లుడు వేణుగోపాల్ స్పందించారు. తమకు జైలు అధికారులు సమాచారం అందించారనడం వాస్తవం కాదని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జైల్లో ములాఖాత్ లు లేనందున వారానికోసారి ఫోన్ చేసే వీలు కల్పించారని, దాంతో ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులకు వరవరరావు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. వారం కింద ఉన్న ఆరోగ్య స్థితిలోనే, బలహీనంగానే ఉన్నారని తెలిపారు. అంతేతప్ప 'వరవరరావు ఆరోగ్యం విషమం'.. 'జైలు అధికారుల నుంచి కుటుంబానికి సమాచారం'.. 'హుటాహుటిన ముంబాయి ప్రయాణమవుతున్న కుటుంబం' అంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని, దానిపై రేపు విచారణ జరుగుతుందని వేణుగోపాల్ తెలిపారు.