వెంకయ్య కుమారుడు ఎంట్రీ.. రాంగ్ స్టెప్ వేస్తున్నారా?

 

వెంకయ్య నాయుడు ప్రాసలకి పెట్టింది పేరు. జాతీయస్థాయి బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన ఆయన తన స్పీచ్ లతో ఆకట్టుకునేవారు. తెలుగుగళం కేంద్రంలో వినిపించేవారు. అయితే ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయన కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడు వెంకయ్య నాయుడుకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఆయన కుమారుడు హర్షవర్ధన్‌నాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నారట. ఇటీవల కాలంలో హర్షవర్ధన్‌ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన తన సన్నిహితుల వద్ద మోదీని పొగుడుతూ, బీజేపీని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారట. అంతేకాదు రాష్ట్రానికి బీజేపీ చాలా చేసిందని, ఇంకా చేస్తుందని.. రాష్ట్ర పాలకుల వైఫల్యం వల్లే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని విమర్శలు చేస్తున్నారట. దీనిబట్టి చూస్తుంటే హర్షవర్ధన్‌ మనస్సు రాజకీయాలవైపు మళ్లినట్లుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరుగుతుందని అప్పట్లో ప్రతిపక్షంలో కీలకంగా వ్యవహరించిన వెంకయ్య నాయుడు పట్టుపట్టి.. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని పోరాడి కేంద్రాన్ని ఒప్పించారు. తరువాత హోదా విషయాన్ని బీజేపీ పెద్దలు పక్కకు పెట్టినా.. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న 'వెంకయ్య' వేరే విధంగానైనా రాష్ట్రానికి ప్రయోజనాల చేకూరేలా అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చేవారు. దీంతో మోదీ కావాలనే ఆయనచే బలవంతంగా మంత్రి పదవికి రాజీనామా చేయించి ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయన బాగా సైలెంట్ అయిపోయారు. ఇక దీంతో రాజకీయాల్లో వెంకయ్య పాత్ర దాదాపు ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు హర్షవర్దన్‌ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నారట.

వాస్తవానికి వెంకయ్య కుమారుడు కానీ, కుమార్తె కానీ.. రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు ఎప్పుడూ ప్రచారం జరగలేదు. వారిలో కుమార్తె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. కుమారుడు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉంటారనేది తెలిసిన విషయమే. హర్షా టయోటా ఇంకా ఇతర వ్యాపారాలు చేస్తున్న ఆయన సడన్‌గా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా బీజేపీలో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా మోదీని, బీజేపీని ఆయన కీర్తిస్తున్నారట. అయితే రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని కీర్తిస్తే రాష్ట్రం నుంచి నాయకుడిగా ఎలా ఎదుగుతారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తోన్నారు. చూద్దాం మరి అసలు హర్షవర్ధన్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో.