బాలు కోసం వెంకయ్య హోమం.. అందుకే ప్రకటన ఆలస్యం?

బహుభాషా గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన సంగీత యోధుడి మరణం యావత్‌ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఎస్పీ బాలు ఇక లేరన్న వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. తెలుగు సినీ లోకమైతే ఎస్పీ బాలు మరణ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. 

 

ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు త్వరగా కోలుకోవాలని కోట్లాది మంది ఆయన అభిమానులు పూజలు చేశారు. సినీ తారలు బాలు క్షేమం కోసం ప్రత్యేక హోమాలు, వ్రతాలు చేశారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఎస్పీ బాలు కోలుకోవాలని ఎంతో తపించారు. ఆయన కోసం పూజలు చేశారు. ఇక బాలు ఆరోగ్యం క్షిణించదన్న వార్తతో వెంకయ్య నాయుడు తీవ్ర మనో వేదనకు గురయ్యారట. బాలు కోసం ఆయన శుక్రవారం రోజున ప్రత్యేక హోమం చేశారని తెలుస్తోంది. అందుకే బాలసుబ్రమణ్యం మరణవార్తను అధికారికంగా ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలసుబ్రమణ్యంను రక్షించడం ఇక కష్టమని డాక్టర్లు చెప్పినా.. వెంకయ్య నాయుడు హోమం చేస్తుండటంతో కొన్ని గంటల పాటు అందరూ వెయిట్ చేశారని తెలుస్తోంది. చివరకు రెండు గంటలు ఆలస్యంగా బాలు చనిపోయారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారని చెబుతున్నారు. బాలు ఆరోగ్యం క్షేమం కోసం వెంకయ్య నాయుడు ప్రత్యేక హోమం చేశారంటే.. ఆయనపై వెంకయ్యకు ఎంతో అప్యాయత ఉందో అర్ధం చేసుకోవచ్చు.