బీజేపీ ఓటమికి కారణం ఆ నాలుగు బాత్‌రూంలేనట.!!

 

గెలుపు ఓటములు సహజం. కొందరు గెలుపుని ఎంత సంతోషంగా తీసుకుంటారో.. ఓటమిని కూడా అంతే సంతోషంగా అంగీకరిస్తారు. కొందరు మాత్రం గెలుపోస్తే మొత్తం క్రెడిట్ అంతా మాదే అంటారు.. ఓటమి వస్తే మాత్రం పక్కవారి మీద తోసేస్తారు. ఇంకా కొందరైతే ఓటమికి వింత వింత కారణాలు వెతికి మరీ చెప్తారు. ఇంతకీ ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే.. రీసెంట్ గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. మిగతా పార్టీలను చిత్తుగా ఓడించి టీఆర్ఎస్ మరోసారి జెండా ఎగురవేసింది. అయితే కొందరు నేతలు ఓటమిని అంగీకరిస్తుంటే.. కొందరు మాత్రం పొత్తు వల్ల ఓడిపోయాం, ఈవీఎంల ట్యాపరింగ్ వల్ల ఓడిపోయామని రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇక కొందరు బీజేపీ నేతలైతే వాస్తు వల్ల ఓడిపోయామని చెప్తున్నారట.

గత ఎన్నికల్లో బీజేపీ 5 స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ 5 సిట్టింగ్ స్థానాలతో పాటు మరికొన్ని స్థానాల్లో గెలుస్తామని భావించింది. కానీ అనూహ్యంగా 5 సిట్టింగ్ స్థానాల్లో 4 స్థానాలు కోల్పోయి ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీ ఆ 4 స్థానాలు కోల్పోవడానికి కారణం 4 బాత్‌రూంలట. వినడానికి వింతగా ఉంది కదా. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఇటీవల ఆధునీకరించారు. మూడు అంతస్తుల్లో మార్పులు చేసి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, అనుబంధ విభాగాలకు చాంబర్లు ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు కూర్చునే స్థానాన్ని మార్చారు. మూడో అంతస్తు పైన 4 బాత్‌రూంలు ఏర్పాటు చేస్తున్నారు. వాస్తుకు విరుద్ధంగా ఈశాన్యంలో 4 బాత్‌రూంలు ఏర్పాటు చేస్తుండటంతోనే.. నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఓడిపోయారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. ఇంకానయం ఐదో బాత్‌రూం కట్టడం మొదలుపెట్టలేదు.. ఒకవేళ మొదలుపెడితే ఉన్న ఆ ఒక్క సీటు కూడా ఎగిరిపోయేదే అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.