వైసీపీ నాయకులకు బోయ కులస్తుల హెచ్చరిక...

 

అనంతపురం జిల్లాలో వాల్మీకి కులస్తులు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కాల్వ శ్రీనివాసులు, జడ్పీ మాజీ ఛైర్మన్ పూల నాగరాజు ఈ సామాజికవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేసిపెట్టేవారు. అంతే కాకుండా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సైతం గట్టిగా డిమాండ్ చేశారు. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సయోధ్య లేకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఆగ్రహించిన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గత ఎన్నికల్లో గంపగుత్తుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. వాల్మీకి కులస్తుడైనప్పటికీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు రాయదుర్గంలో ఓటమి పాలవడం, జడ్పీ మాజీ చైర్మన్ పూల నాగరాజు గుమ్మగట్ట మండలంలో ఐదు వేలకు పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు జేసీ కుటుంబాన్ని కాదని ఒక సామాన్య అధికారైన తలారి రంగయ్యను అనంతపురం ఎంపీగా గెలిపించారంటే బోయ కులస్థుల ఓటు పవర్ ఏ పరిధిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కుల రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతల ఒక గ్రూప్ గా అదే పార్టీలోని బలహీన వర్గాలకు చెందిన నేతలు మరో గ్రూపుగా విడిపోయారు. జగన్ క్యాబినెట్ లో పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు మంత్రిగా అవకాశం లభించటంతో అధికారం రుచి చూడాలని ఆశించిన అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు అసంతృప్తికి గురయ్యారు. మంత్రికి అండగా అనంతపురం పార్లమెంటు సభ్యులు రంగయ్య నిలవడంతో వార్ వన్ సైడ్ కాకుండా ఆయన అడ్డు తగులుతున్నారని రెడ్డి సామాజికవర్గ నేతలు భావిస్తున్నారు. వాల్మీకి సామాజిక వర్గం అధికంగా ఉండే అనంతపురం పార్లమెంటు పరిధిలో తమను ఎదగనీయకుండా కొందరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతారంటూ ఎంపి రంగయ్య వద్ద బోయలు వాపోతున్నట్టు వినిపిస్తుంది.దీంతో గత మూడు నెలలుగా తమ ఆవేదనను దిగమింగుతూ వచ్చిన ఎంపి రంగయ్య వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా అధికార పక్షంలో కొంత మందిని ఓ ఆటాడుకున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు గుమ్మనూరు జయరాం, శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ ముందే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. చంపేవాడు చచ్చేవాడు బోయవాడు, బోయవాడికి బోయవాడికి మధ్య గొడవెందుకు, ఎవడైతే బోయలను ఉసిగొల్పుతాడో వాడి తల తీస్తే తన్నుకు చేయవలసిన అవసరం రాదు అంటూ అనంత ఎంపీ తలారి రంగయ్య వ్యాఖ్యానించారు. సౌమ్యుడిగా పేరొందిన రంగయ్య నోటి నుంచి తూటాల్లాంటి మాటలు రావటంతో సభలో ఉన్నవారంత నిర్ఘాంతపోయారు. 

ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రంగయ్య వ్యాఖ్యలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోనే ఇలాంటి మాటలు అన్నారంటే ఎంపీలు ఎంతటి ఆవేదన గూడుకట్టుకుని ఉందో అర్థం చేసుకోవాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. స్వపక్షంలోనే మరో సామాజిక వర్గం వారు మాత్రం ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే బోయలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ తరుణంలో రంగయ్య మాట్లాడుతూ ఈ డిమాండ్ నెరవేర్చటానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలకు మంత్రి శంకరనారాయణ చీఫ్ విప్ కాపురామచంద్రరెడ్డి వంత పాడారు. మరో మంత్రి జయరాం మాట్లాడుతూ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాల్మీకి సామాజికవర్గ పెద్దలు కూడా ఇదే పాట పాడారు. రాయలసీమలో ఉన్న యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించామని ఎస్టీ జాబితాలో కనుక తమను చేర్చకపోతే ప్రస్తుత అధికార పక్షాన్ని కూడా సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.