లోకేషే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? లోకేష్ అందర్నీ అవమానించాడా?

వల్లభనేని వంశీ... జూపూడి ప్రభాకర్... ఇలా టీడీపీని వీడుతోన్న నేతల టార్గెట్ అంతా నారా లోకేషే. తెలుగుదేశాన్ని వీడుతోన్న లీడర్లంతా లోకేష్ టార్గెట్ గానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తమలో దాచుకున్న ఆక్రోశాన్ని, కసిని వెళ్లగగ్గుతున్నారు. అధినేత చంద్రబాబును వదిలేసి చినబాబుపైనే రగిలిపోతున్నారు. వైసీపీ నేతలు కూడా విమర్శించనంతగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, లోకేష్ పై ఇంత పచ్చిగా విమర్శలు చేయడానికి... అధికారంలో ఉండగా చినబాబు చూపించిన వ్యవహార శైలే కారణమంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ నారా లోకేష్ అవమానించాడనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తోటి మంత్రులనే కాదు... నాలుగైదు గెలిచిన ఎమ్మెల్యేలను, సీనియర్ లీడర్లను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఇలా ఎవరినీ లెక్కచేసేవారు కాదంట.

చంద్రబాబు తనయుడుగా... దాదాపు సెకండ్ పవర్ సెంటర్ గా వ్యవహరించిన లోకేష్... తనను కలవడానికి వచ్చిన ఎవరికీ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించేవారట. వయసులో చిన్నవాడైనా లోకేష్ ను కలిసేందుకు జేసీ లాంటి సీనియర్లు సైతం గంటల తరబడి గది బయట వేచి చూడాల్సి వచ్చేదట. అలా, లోకేష్ చేతిలో అవమానాలు ఎదుర్కొన్న నేతలే... ఇప్పుడు పార్టీని వీడుతూ తమ కసి అంతా తీర్చుకుంటున్నారని అంటున్నారు. చంద్రబాబు కంటే చినబాబుపైనే ఎక్కువగా విరుచుకుపడటానికి... అధికారంలో ఉండగా లోకేష్ వ్యవహరించిన తీరే కారణమంటున్నారు. అందుకే పోతూపోతూ లోకేష్ ను చెడుగుడు ఆడుకుంటున్నారని టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. అధికారంలో ఉండగా లోకేష్ తన పవర్ అండ్ ఆటిడ్యూడ్ చూపించాడని... ఇప్పుడు వాళ్ల వంతు వచ్చింది... అందుకే ఇంతలా పచ్చిగా తిడుతూ తమ కసి తీర్చుకుంటున్నారని అంటున్నారు.

వల్లభనేని వంశీ.... నారా లోకేష్ ను టార్గెట్ చేయడం వెనుక... చినబాబు నుంచి ఎదురైన అవమానాలే కారణమనే టాక్ వినిపిస్తోంది. అందుకే, చంద్రబాబును పక్కనబెట్టి... లోకేష్ పై విరుచుకుపడుతున్నాడని అంటున్నారు. ఇప్పటికీ చంద్రబాబునాయుడు గారు అంటూ సంభోదిస్తున్న వల్లభనేని వంశీ.... లోకేష్ ను మాత్రం పప్పు... తుప్పు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ఇది వల్లభనేని వంశీ ఒక్కడి ఆక్రోశమే కాదు... టీడీపీలో చాలా మంది వాయిస్ కూడా ఇలాగే ఉందంటున్నారు. మీరు రాజులం... మీరు బానిసులనే విధంగా లోకేష్ వ్యవహరశైలి ఉండేదని... ఎంతటి సీనియర్లతోనైనా ఇలాగే ప్రవర్తించేవారని, అందుకే... చాలా మంది నేతలు బాబు కంటే లోకేష్ పైనే గుర్రుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు.

అయితే, తెలుగుదేశం పార్టీ పగ్గాలు త్వరలో నారా లోకేష్ కి అప్పగించేందుకు చంద్రబాబు రంగంసిద్ధంచేస్తున్నారని, అందులో భాగంగా ముందుగా టీటీడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయబోతున్నారని పార్టీ లీడర్లు అంటున్నారు. తన తదనంతరం పార్టీపై లోకేష్ కి పట్టు ఉండాలంటే....ఇప్పట్నుంచే పూర్తి బాధ్యతలు అప్పగించాలని బాబు భావిస్తున్నారట. అయితే, లోకేష్ కింద పనిచేయడం ఇష్టంలేని నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారని, వెళ్తూవెళ్తూ చినబాబు చేతగానితనాన్ని రోడ్డు మీదకు లాగిమరీ వెళ్తున్నారని అంటున్నారు. అసలు జయంతికి వర్ధంతికి తేడా తెలియని లోకేష్ పార్టీని ఎలా నడిపించగలడన్న వల్లభనేని మాటలనే మరికొందరు టీడీపీ నేతలు త్వరలో వినిపించబోతున్నారట. మరి, ఈ గడ్డు పరిస్థితిని లోకేష్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.