ఉపనిషత్తులో చెప్పిన ప్రేమ

ప్రేమ ఎప్పుడూ మోహానికీ, దుఃఖానికీ కారణం అవుతుందంటారు. కానీ ప్రేమలో స్వార్థం నిండినప్పుడే అలా జరుగుతుందేమో! ఎందుకంటే నిజమైన ప్రేమ ఎదుటి మనిషికి నమ్మకం అనే రెక్కలనిస్తుందే కానీ, మోహం అనే సంకెళ్లతో తన ఎదుట బంధించుకోదు. నిజమైన ప్రేమ ఇవ్వగలిగినది ఇస్తుందే కానీ, ఫలితాన్ని ఆశించి బంధాన్ని వ్యాపారంగా మార్చేయదు. అలాంటప్పుడు ప్రేమ మోహానికీ, దుఃఖానికీ కారణం ఎలా అవుతుంది. కాదు గాక కాదు. పైగా తన ప్రేమతో ప్రతి జీవితాన్నీ వెలిగిస్తుంది. అలా వెలిగిన జీవితాలలో తన సార్థకతను చూసుకుంటుంది. ఇది ఎవరో ఒకరు చెప్పింది కాదు. ఏదో ఒక చోట అనుకునే గాలివాటు మాటా కాదు. ఆలోచన ఉన్న ప్రతి మనిషికీ తట్టిన భావం. కావాలంటే ఈ ఉపనిషత్తు మంత్రాన్ని చూడండి...

యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః
తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః

అని చెబుతోంది ఈశావాస్యోపనిషత్తులోని ఒక మంత్రం. ఆత్మానుభూతిని పొందినవాడికి ఈ ప్రపంచంలోని జీవులన్నీ కూడా తనలోని భాగమే అనిపిస్తుందట. ప్రపంచంలోని ప్రతి జీవిలోనూ తానున్నానన్న భావన కలుగుతుందట. అలాంటప్పుడు ఇక తారతమ్యాలు ఎలా కలుగుతాయి? అందుకనే ఈ భావనతో ఉన్నవారికి దేనిపట్లా మోహం కానీ, దుఃఖం కానీ కలుగవు అని ఈ మంత్రం చెబుతున్న అర్థం.

అదీ సంగతి! ఉపనిషత్కారులు ప్రేమని మరో మెట్టుని పైకి తీసుకువెళ్లారు. వారి దృష్టిలో ప్రేమ అంటే విశ్వజనీనమైనది. ప్రేమ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్లు భౌతికమైనది కాదు. మోహంతో బంధించేది, దక్కకపోతే దుఃఖించేది కాదు. ఈ లోకంలో ‘నేను’ అన్న పదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ‘నువ్వు’ అన్న మాటకి అంతే అర్థం ఉందని గుర్తించడం. నువ్వు, నేను కలిస్తేనే ఈ లోకం అని భావించడం. ఆ భావనతోనే ప్రతి జీవినీ గౌరవించడం. అలాంటప్పుడు యాసిడ్‌ దాడులుండవు. అడ్డుగోడలుండవు. నేను గొప్ప, నువ్వు తక్కువ అన్న తారతమ్యాలు అసలే ఉండవు. ఇలాంటి ప్రేమ మన మనసులో నిండితే ప్రతిరోజూ ప్రేమకి పండుగే కదా!

- నిర్జర.