వాజ్ పేయ్ విషయంలో బీజేపీ నేతల వివాదాస్పద ట్వీట్లు!

వాజ్ పేయ్ ఎయిమ్స్ లో వున్నారు! అశేష భారత ప్రజానీకం బాధలో వున్నారు! ఆయన కమలదళానికి చెందిన కాషాయనేతే అయినా… అజాతశత్రువు. అందుకే, ఆయనంటే పడని వారంటూ ఎవరూ లేరు. ఆయన వాదనలు, సిద్ధాంతాలు నచ్చనివారు వుంటారేమో కానీ ఆయనని వ్యక్తిగతంగా ద్వేషించే వారు అస్సలు వుండరు. ఆ వ్యక్తిత్వం కారణంగానే వాజ్ పేయ్ తన సుదీర్ఘమైన ప్రస్థానం తరువాత కూడా మచ్చలేకుండా మిగిలారు. కానీ, ఇప్పుడు స్వయంగా బీజేపీ నేతల ట్వీట్లే జనాల బాధని మరింత పెంచుతున్నాయి. వాళ్లది తొందరపాటా లేక నిర్లక్ష్యమా అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పోనీ తప్పులు చేస్తోంది ఏ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వారా అంటే అదీ కాదు. వాజ్ పేయ్ స్వంత పార్టీ వారైన బీజేపీ సీనియర్ నేతలే!

 

 

వాజ్ పేయ్ మరణించారు. నేను తీవ్రంగా విషాదాన్ని వ్యక్తం చేస్తున్నా అనేశారు తథాగత రాయ్! ఎవరీయనా అంటారా? బీజేపీకే చెందిన నేత. పైగా త్రిపుర గవర్నర్ కూడా! రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్న ఆయనకు అంత తొందర ఎందుకు? వాజ్ పేయ్ ఇంకా ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారనే మీడియా చెబుతోంది. ఏ ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ వాజ్ పేయ్ మరణించారని బ్రేకింగ్ వేయలేదు. అయినా ఒక గవర్నర్ అయి వుండి దేశానికి ఎంతో సేవ చేసిన స్వంత పార్టీ అత్యున్నత నేతని పట్టుకుని నిర్లక్ష్యపు ట్వీట్లు ఎందుకు? తథాగత రాయ్ కే తెలియాలి!

 

 

బీజేపీ నియమించిన గవర్నర్ గా వున్న తథాగత రాయ్ చేసిన తప్పును త్వరగానే తెలుసుకున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పారు. అయినా కొందరు నెటిజన్లు మండిపడ్డారు. సరిగ్గా తెలుసుకోకుండా తొందరపాట్లు ఎందుకంటూ! అయితే, అంతలోనే మరో బీజేపీ నేత షాకిచ్చారు దేశానికి! ఈసారి వాజ్ పేయ్ మరణం నన్ను తీవ్రంగా బాధించిందంటూ వాపోయిన వ్యక్తి యడ్యూరప్ప! దక్షిణాదికి చెందిన ఏకైక బీజేపీ మాజీ చీఫ్ మినిస్టర్ ఈయన! యెడ్డీ కూడా ట్విట్టర్ లో నోరు జారారు! వాజ్ పేయ్ ఇంకా తుది శ్వాస వదలక ముందే ఆయన లేని నష్టం పూడ్చలేనిదంటూ మొదలెట్టేశారు! అసలు ఏంటి ఈ గోల?

పొరపాటున ఏదో ట్వీట్ చేయటం ఎవరికైనా జరిగేదే. కానీ, వాజ్ పేయ్ లాంటి మహోన్నతమైన నేత మృత్యువుతో పోరాడుతుంటే ఆయన అభిమానులు, శ్రేయోబిలాషులపై క్రూరమైన ప్రయోగాలు అవసరమా? తప్పు చేసి ట్వీట్ డిలీట్ చేసి సారీ అంటే సరిపోతుందా? ఏదో అనివార్య పరిస్థితిలో తప్పుడు ట్వీట్ చేయటం వేరు! బీజేపీ వాళ్లు తమ స్వంత నాయకుడి మరణ వార్త చెప్పటానికి అంత తొందరపడిపోవటం ఎందుకు? వార్తని బ్రేక్ చేసి జనానికి అందించటానికి మీడియా ఛానల్స్ వున్నాయి  కదా? ట్విట్టర్లో బతికి వున్న వారికే నివాళులు అర్పిస్తూ జనాల మనోభావాలతో ఆడుకోవటం దేనికి?

 

తథాగత రాయ్, యడ్యూరప్ప చేసిన పొరపాట్లు మరెవరూ ఇప్పుడే కాక ఇక ముందు కూడా చేయకపోతే ఎంతో మంచిది! ఒక తొందరపాటుతో చేసే నిర్లక్ష్యపు ట్వీట్ ఎందరికో మనస్తాపం కలిగిస్తుంది!