టీడీపీ అభ్యర్థి రేవూరి పోటీ నుంచి తప్పుకుంటారా?

 

కాంగ్రెస్ 65 మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. అదేవిధంగా టీడీపీ కూడా 9 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. దీంతో ఈ 74 స్థానాల మీద స్పష్టత వచ్చింది ఇక మిగతా స్థానాల అభ్యర్థుల ఎంపిక మీద దృష్టిపెడితే చాలు అనుకున్నారు. కానీ కొందరు ఆశావహులు టిక్కెట్లు ప్రకటించిన స్థానాల్లో కూడా ఇంకా ఆశ పోగొట్టుకోవట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఒక స్థానం విషయంలో పట్టుబడుతున్నారు. అదే వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం. టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన జాబితాలో  వరంగల్‌ పశ్చిమ కూడా ఉంది. ఈ స్థానం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు ప్రకటించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికే వరంగల్‌ పశ్చిమ టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు హన్మకొండలోని డీసీసీ భవన్‌లో రెండు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి విదితమే. పొత్తులో భాగంగా ఆ సీటుని కాంగ్రెస్ టీడీపీకి కేటాయించింది. టీడీపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. అయినా కాంగ్రెస్ నేతలు పట్టువీడకుండా రాజేందర్‌రెడ్డికే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు దీక్షలో పాల్గొన్న నేతలను సంప్రదించారు. దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ తో పాటు మిగతా నాయకులతో చర్చించారు. న్యాయం చేయాలని నాయకులు,కార్యకర్తలు వి.హెచ్ ను చుట్టుముట్టారు. రాజేందర్‌రెడ్డికి టిక్కెట్, బీ-ఫాం కేటాయింపు తర్వాతే దీక్ష విరమిస్తామని కట్ల శ్రీనివాస్‌ సమాధానమిచ్చారు. వి.హెచ్ నచ్చచెప్పే యత్నంచేసినా స్వీయ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న నేతలు డీసీసీ భవన్‌ నుంచి బయటకు రాలేదు.

అనంతరం వి.హెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో రాజేందర్‌రెడ్డి అన్ని విధాలా సేవలందించారన్నారు. ఆయనకు పశ్చిమ టిక్కెట్ దక్కకపోవడం సమంజసం కాదన్నారు. ఈ విషయమే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీడీపీ అధినేత చంద్రబాబు, టీటీడీపీ అధ్యక్షుడు రమణలతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

వి.హెచ్ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా నేతలు వినలేదు. రాజేందర్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. పాపం వి.హెచ్ చేసేదేమి లేక ఉత్తమ్‌, కుంతియా, చంద్రబాబు, రమణలతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇది ఇప్పుడు ఎంతవరకు సాధ్యం. టీడీపీ ఇప్పటికే వరంగల్‌ పశ్చిమ అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ మొదటినుంచి టిక్కెట్ల విషయంలో పెద్దగా పట్టుబట్టలేదు. టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా, కూటమి ప్రయోజనాల దృష్ట్యా 14 స్థానాలతో సరిపెట్టుకుంది. మరి ఇప్పుడు సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి నేత స్థానాన్ని అడిగితే అంగీకరిస్తుందా?. రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటారా? అంటే అనుమానమే. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని మార్చడానికి సుముఖుత వ్యక్తం చేయకపోవొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఒక్కసారి అభ్యర్థిని మార్చడం మొదలుపెడితే మిగతా స్థానాల్లోని ఆశావహులు కూడా ఇదే విధంగా పట్టుబట్టే అవకాశముంది. దీంతో ఇన్నాళ్లు చర్చలు జరిపి, కసరత్తులు చేసి, సీట్ల కేటాయింపు చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అదీగాక ఇప్పటికే టిక్కెట్ల విషయంలో కూటమికోసం టీడీపీ చేసిన త్యాగాలు కాంగ్రెస్ కి తెలుసు. వీటినిబట్టి చూస్తుంటే కాంగ్రెస్ వరంగల్‌ పశ్చిమ అభ్యర్థిని మార్చడానికి సుముఖుత వ్యక్తం చేయకపోవొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాజేందర్‌రెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో అని కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.