మోదీ కొంప ముంచనున్న ఉత్తర్‌ప్రదేశ్‌

 

ఉత్తర్‌ప్రదేశ్‌ అంటే ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రంగానే తెలుగువారికి పరిచయం. కానీ రాజకీయంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎవరికి ఎక్కువ లోక్‌సభ సీట్లు వస్తే, ఆ పార్టీనే కేంద్రంలో చక్రం తిప్పుతుంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 80 లోక్‌సభ స్థానాలున్నాయి మరి! 2014 ఎన్నికలలో మోదీ ప్రధానమంత్రి అయ్యారంటే దానికి ఉత్తర్‌ప్రదేశ్‌ చలవే కారణం. ఆ ఎన్నికలలో బీజేపీ ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. కానీ క్రమంగా అక్కడి పరిస్థితులు మారుతున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రి కావడం చరిత్ర. ఒక స్వామీజీ ముఖ్యమంత్రి కావడంతో అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీ సంబరంలో మునిగిపోయాయి. కానీ ఆ సంబరాలు ఎక్కువకాలం నిలవలేదు. యోగి పాలన పట్ల ప్రజలు ఏమంత సుముఖంగా లేరని తేలిపోయింది. గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో పిల్లల మరణాల దగ్గర్నుంచీ, వారణాసిలో ఫ్లై ఓవర్ కుప్పకూలిపోవడం వరకు అనేక సందర్భాలలో ఆదిత్యనాధ్ ప్రభుత్వ వైపల్యం స్పష్టంగా కనిపించింది. అందుకేనేమో! ఆదిత్యనాధ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు.... ఏకంగా నాలుగు ఉప ఎన్నికలను కోల్పోయింది. వీటిలో ఆదిత్యనాధ్‌కు పెట్టని కోటలా ఉన్న గోరఖ్‌పూర్‌ కూడా ఒకటి కావడం గమనార్హం. మొన్నటి కైరానా స్థానానికి జరగిన ఎన్నికలో ఓడిపోవడం మరీ సిగ్గుచేటుగా మిగిలిపోయింది.

యూపీలో వరుస ఓటముల తర్వాత... ప్రజల సంగతి అలా ఉంచితే, తోటి బీజేపీ నాయకులు కూడా ఆదిత్యనాధ్‌ పాలన మీద దండయాత్రని మొదలుపెట్టారు. ఆయనను దింపేసి కేశవ్ ప్రసాద్‌ మౌర్యని ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్‌ను బహిరంగంగానే వెల్లడించడం మొదలుపెట్టారు. ఒకపక్క ప్రతిపక్షాలన్నీ వ్యూహాత్మకంగా ఒక్కటవుతుంటే... బీజేపీ మాత్రం చీలిక దిశగా సాగుతోంది.

సహజంగానే ఈ పరిణామాలతో బీజేపీ నాయకత్వంలో గుబులు మొదలైంది. హుటాహుటిన ఆదిత్యనాధ్‌ను దిల్లీ పిలిపించుకున్నారు. అయితే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు అమిత్‌ షా ఇష్టపడకపోవచ్చు. మోదీ- అమిత్‌ షాలు తమకు వీరవిధేయంగా ఉన్నవారిని కాపాడుకుని తీరతారు. పైగా ఆదిత్యనాధ్‌ను తొలగించడం అంటే తమ ఓటమిని సగం అంగీకరించడమే! అన్నింటికీ మించి ఆదిత్యనాధ్‌ తొలగింపు ఆరెస్సెస్‌ ఆగ్రహానికి కారణం కాక తప్పదు. మరి ఒకప్పుడు బద్ధవైరులుగా ఉన్న కాంగ్రెస్, బహుజన్‌ సమాజ్‌వాదీ, సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌, రాష్ట్రీయ జనతాదళ్‌లాంటి పార్టీలన్నీ కలిసి కమ్ముకొంటున్న వేళ... బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని రూపొందిస్తుందో చూడాలి!