ధర్మం గెలుస్తుంది... న్యాయం నిలుస్తుంది

ధర్మానికి మరణం ఉండదని, న్యాయానికి  సంపూర్ణ ఆయుష్షు ఉంటుందని మరోసారి రుజువైంది ఎప్పుడో 23 సంవ‌త్సరాల క్రితం న‌మోదైన యూరియా కేసుకు ఇప్పుడు మోక్షం క‌లిగింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండ‌గా... తెలుగు వాడు పి.వి.న‌ర‌సింహారావు  ప్రధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దేశాన్ని కుదిపేసిన యూరియా స్కాం కేసుకు ఎట్టకేలకు తీర్పు వెలువడింది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న పి.వి.నరసింహారావు సమీప బంధువు సంజీవ రావుకు కోటి రూపాయల జరిమానాతో  పాటు మూడు సంవత్సరాల జైలు శిఓ విధించింది.

 

 

ఈయనకు సహకరించిన మరో ఇద్దరు మల్లేశం గౌడ్, సాంబశివరావులకు ఐదేసి కోెట్ల జరిమానా విధించింది. ఇక ఈ కేసులో కీలకనిందితులైన టర్కీ దేశస్ధులు టంకే అలంకస్, సిహాన్ కరాన్సీలకు వంద కోట్ల జరిమానా విధించింది. ఒక కేసులో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఒక విధంగా ఇది దేశంలోనే చారిత్రక తీర్పుగా నిలిచిపోతుంది. ఆ రోజుల్లో దేశాన్ని కుదిపేసిన యూరియా కుంభకోణం విలువ ఏకంగా 133 కోట్ల రూపాయలు. ఈ రోజుల్లో 133 కోట్ల రూపాయలు పెద్ద మొత్తంగా కనిపించకపోవచ్చు కాని... ఆ రోజులతో పోలిస్తే అది చాలా పెద్ద మొత్తం. అందుకే ఈ కుంభకోణం అప్పట్లో సంచలనం రేపింది. నైతికత... నిజయితీ ఇంకా పూర్తిగా నాశనం కాని కాలంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

 

 

దేశవ్యాప్తంగా ఉత్కంఠను, కలకలాన్ని రేపిన యూరియా కేసుపై సర్వత్రా చర్చ జరిగింది. ఈ కేసుపై సిబిఐ ప్రత్యేక శ్రద్ధ కనబరిచినా పెద్దగా సంచలనాలు ఏవీ వెలుగులోకి రాలేదు. టర్కీ దేశం నుంచి దేశానికి అవసరమైన రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసేందుకు అక్కడి కంపెనీతో ఒప్పందం చేసుకుంది భారత ప్రభుత్వం. దీనికి గాను 38 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 133 కోట్ల రూపాయలు ముందే చెల్లించాలని ఒప్పందం. ఈ తతంగమంతా పూర్తి అయిన తర్వాత చూస్తే టర్కీలో అసలు కంపెనీయే లేదని తేలింది. ఇదీ ఈ కుంభకోణంలో కీలకం.కేసులు నమోదు చేసి... విచారణ ప్రారంభించినప్పటికీ అది నత్తనడకనే సాగింది. అటల్ బిహారీ వాజపేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో తూతూ మంత్రంగా సాగిన విచారణ ఆ తర్వాత యుపిఏ పాలనలో నీరుకారింది. ఇది మన రాజకీయ వ్యవస్ధకు అద్దం పట్టింది.

 

అధికారంలో ఉన్న వారు ఎలాంటి చర్యలకైనా తెగబడతారని, ఎంతటి పెద్ద కుంభకోణమైనా పక్కదారి పట్టిస్తారని ప్రపంచానికి తెలియడానికి యూరియా కుంభకోణం కేసే ఓ పెద్ద ఉదాహరణ. అయితే, ధర్మం నాలుగు పాదాల కాకపోయినా... రెండు పాదాలపైనైనా నడుస్తుంది అనడానికి యూరియా కుంభకోణం కేసే ఓ నిరూపణ. దేశంలో నానాటికి పెరిగి పోతున్న అవినీతిని నిలువరించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మంచి పరిణామం. తప్పులు చేసే ముందు మనకేం కాదులే అని అనుకునే వారికి ఈ తీర్పు ఓ గగుర్పాటు. ఎలాంటి నేరమైనా... ఎంతటి భారీ కుంభకోణమైనా చేసేసి హాయిగా బయట పడవచ్చుననుకునే వారి వెన్నులో వణుకు ఈ తీర్పు.

 

 

ఈ దేశాన్ని బాగుచేయలేం.... అవినీతిని రూపుమాపలేం అంటూ అరుగుల మీదా... పట్టణాలు, నగరాల్లోనూ ప్రధాన కూడళ్ల వద్ద చర్చలు జరిపే వారికి దేశంలో న్యాయం బతికే ఉందని చెప్పింది ఈ తీర్పు. ఇలాంటి తీర్పుల వల్ల అవినీతి పూర్తిగా సమసిపోతుందని, రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుందని పూర్తిగా చెప్పలేం. అయితే తాజా తీర్పు కారణంగా నేరానికి, ఏదైనా కుంభకోణం చేసేందుకు ప్రయత్నించే వారికి మాత్రం ఐదు నిమిషాల పాటు ఆలోచించేలా చేస్తుంది. ఆ ఐదు నిమిషాలు చాలు మనిషి తన ఆలోచనలను మార్చుకోవడానికి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చారిత్రాత్మకం... అద్భుతం... అమోఘం.