బాబుకి ఫోన్ చేస్తే తమరి లెవలేం తగ్గదులే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మోడీకి మాత్రం అహంకారం అడ్డు వస్తోంది. ప్రస్తుతం తాను వున్న లెవల్‌కి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయంగా ఫోన్ చేయాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నారు. అయితే చంద్రబాబుకి ఫోన్ చేస్తేనే పరిస్థితి చక్కబడే అవకాశం వుంది. ఫోన్ చేయడానికి మాత్రం మోడీకి మనసు రావడం లేదు.

 

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక బీజేపీ నాయకుల నోటి పుణ్యం కావచ్చు... కేంద్రం ఏపీకి చూపించిన మొండి చెయ్యి కావచ్చు.. మొత్తం మీద రాష్ట్రంలో బీజేపీ మీద రాజకీయ వర్గాల్లో, జనాల్లో ఆగ్రహం బాగా పెరిగిపోయింది. మోడీ పేరు చెబితేనే ఏపీ జనాలు చిరాకు పడుతున్నారు. మోడీ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీకి మొండి చెయ్యి చూపిస్తున్నారన్న భావన కూడా బాగా పెరిగిపోయింది. కేంద్ర బడ్జెట్ తర్వాత తన పట్ల ఏపీ ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయినట్టుకు మోడీ సార్‌కి బాగా అర్థమైనా, పైకి మాత్రం అర్థం కానట్టు వున్నారు.

 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, మిత్రపక్షంగా వున్న బీజేపీ నాయకులు ప్రభుత్వం మీద, తన మీద నోరు పారేసుకుంటున్నా చంద్రబాబు  గుట్టుగా వ్యవహరిస్తున్నారు. తెగేదాకా లాగేట్టు కాకుండా... పార్లమెంటులో న్యాయపోరాటం చేయడం ద్వారానే హక్కులను సాధించుకోవాలని భావించారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చేస్తున్న పోరాటం కేంద్ర ప్రభుత్వంలో కదలిక తెచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎంపీలను బుజ్జగించి దారిలో పెట్టాలనే ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబుకు ఫోన్ చేసి రాజీ చేసుకోవడం మాత్రమే మోడీ ముందు వున్న ఏకైక పరిష్కారం. అయితే ఫోన్ చేయడానికి మోడీ బెట్టు చేస్తున్నారు.

 

అయ్యా మోడీ గారు.. చంద్రబాబుకు ఫోన్ చేసి, ఆంధ్రప్రదేశ్‌కి అవసరమైన సహకారాన్ని అందిస్తానని చెబితే తప్ప తమరి మీద ఏపీ జనంలో వున్న ఆగ్రహం తగ్గే అవకాశం లేదు. అంచేత తమరు ఇంకా ఆలస్యం చేసి మరింత డ్యామేజ్ కావడం మంచిదంటారా? అయినా మీరు ఫోన్ చేయాల్సింది ఎవరో ఆషామాషీ లీడర్‌కి కాదు... గతంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వద్దని చెప్పిన నిఖార్సయిన నాయకుడికి. అంచేత ఏ రకంగా చూసినా ఆయన స్థాయి మీతో సమానమైనదే. చంద్రబాబుకి ఫోన్ చేస్తే తమరి లెవలేం తగ్గదు. అంచేత ఇప్పటికైనా బెట్టు చేయకుండా చంద్రబాబుకి ఫోన్ చేయండి... ఏపీకి న్యాయం చేయండి.. మీ మర్యాద కాపాడుకోండి.