గతాన్ని మార్చివేసే కథ!

అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ఏ విషయమూ నచ్చేది కాదు. ఎవరూ సరైనవారిగా తోచేవారు కాదు. కాలేజి నుంచి ఇంటికి వచ్చేసరికి అతని మనసులో ఎంతో అసంతృప్తి. మదిలో ఎన్నో ఆరోపణలు. ఆ కుర్రవాడి తండ్రి, పాపం రోజంతా కష్టపడి ఇంటికి చేరుకునేవాడు. కాసేపు తన కుటుంబంతో కాలక్షేపం చేద్దామనుకునేవాడు. ఈలోగా కుర్రవాడు తన మనసులో ఉన్న అసంతృప్తినంతా వెళ్లగక్కేవాడు. పదే పదే ఆ పగలు జరిగిన విషయాలన్నింటినీ తండ్రితో పూస గుచ్చినట్లు చెప్పేవాడు. కుర్రవాడికి ఎంతగా సర్దిచెప్పినా ఊరుకునేవాడు కాదు.

 

కుర్రవాడి మనస్తత్వంతో తండ్రి విసిగిపోయాడు. కానీ ఏం చేసేది. ఎంతగా అనునయించినా కుర్రవాడు తన మాట వినడం లేదు సరికదా... జీవితం మీద అతని ఆరోపణలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తన బతుకు బతకడం మానేసి ఎదటివారి లోపాలనే అతను లెక్కపెడుతూ కూర్చుంటున్నాడు. ఆ కుర్రవాడని కనుక ఇలాగే వదిలేస్తే అతను ఎందుకూ పనికిరాకుండా పోతాడని తండ్రికి అర్థమైంది. దాంతో ఓ రోజు తన గురువుగారి దగ్గరకు వెళ్లి తన గోడునంతా చెప్పుకొన్నాడు.

 

కుర్రవాడి తండ్రి చెప్పిన మాటలను గురువుగారు చిరునవ్వుతో ఆలకించాడు. తర్వాత ‘నువ్వు రేపు ఉదయం నీ కొడుకుని నా దగ్గర విడిచిపెట్టి వెళ్లు. మళ్లీ సాయంత్రానికి వచ్చి అతన్ని తీసుకుపో!’ అని చెప్పాడు.

 

గురువుగారు చెప్పినట్లే తండ్రి తన కొడుకుని మర్నాడు ఉదయమే ఆయన ఆశ్రమంలో విడిచిపెట్టాడు. ‘బాబూ ఇవాళ మధ్యాహ్నం వరకూ నేను జపతపాలతో హడావుడిగా ఉంటాను. నువ్వు కాస్త ఆశ్రమంలో తిరుగుతూ కాలక్షేపం చేయి. మధ్యాహ్నం నీతో మాట్లాడతాను,’ అని తన గదిలోకి వెళ్లిపోయారు గురువుగారు.

 

గురువుగారి సూచన ప్రకారం కుర్రవాడు ఆశ్రమం అంతా కలియతిరగసాగాడు. యథాప్రకారం అతనికి అందులో చాలాలోటుపాట్లు కనిపించాయి. చాలామంది ప్రవర్తన కూడా అతనికి నచ్చలేదు. ఆ లోపాలన్నింటినీ గమనిస్తూ అతను మధ్యాహ్నం వరకూ గడిపేశాడు.

 

మధ్యాహ్నం గురువుగారు కుర్రవాడిని కలిశారు. ‘ఏం బాబూ నీకు ఇక్కడ ఎలా తోచింది!’ అని అడగడమే ఆలస్యం. తను చూసిన తప్పులన్నీ గురువుగారికి ఏకరవు పెట్టాడు కుర్రవాడు.

 

‘మంచిది! నీకు ఇంత సునిశితమైన దృష్టి ఉందని నాకు తెలియదు. ఈ లోకం తీరుతో నువ్వు చాలా బాధపడినట్లు కనిపిస్తున్నావు. నీ బాధ తగ్గేందుకు నేను ఓ సరదా కథ చెబుతాను విను. పూర్వం అక్బర్ అనే రాజు ఉండేవాడు, అతని ఆస్థానంలో బీర్బల్‌ అనే మంత్రి ఉన్నాడు....’ అంటూ నవ్వు పుట్టించే ఓ అక్బర్‌ బీర్బల్‌ కథ చెప్పాడు.

కుర్రవాడు ఆ కథని ఆస్వాదించినట్లే కనిపించాడు. కానీ ఓ పదినిమిషాల్లో మళ్లీ అతని మనసుకి ఏదో గతం గుర్తుకువచ్చిన మళ్లీ దిగాలుపడిపోయాడు. ‘అరెరే నువ్వు మళ్లీ దిగాలుగా కనిపిస్తున్నావు. ఉండుందు నీ మనసుని మళ్లీ గాడిలో పెడతాను. అందుకోసం ఓ సరదా కథ చెబుతాను విను. పూర్వం అక్బర్ అనే రాజు ఉండేవాడు, అతని ఆస్థానంలో బీర్బల్‌ అనే మంత్రి ఉన్నాడు....’ అంటూ ఇందాక చెప్పిన కథనే మళ్లీ చెప్పాడు గురువుగారు.

రెండోసారి కూడా కుర్రవాడు ఆ కథని కాస్త ఆస్వాదించాడు. కానీ ఇంతకుముందే ఆ కథని వినేశాడు కదా! దాంతో కథ విన్న రెండు నిమిషాలకే అతని మనసు యథాస్థితికి చేరుకుంది. ‘అరెరే నువ్వు మళ్లీ దిగాలుగా కనిపిస్తున్నావు. ఉండుండు, నీకు కాస్త సంతోషాన్ని కలిగిస్తాను. పూర్వం అక్బర్ అనే రాజు ఉండేవాడు, అతని ఆస్థానంలో బీర్బల్‌ అనే మంత్రి ఉన్నాడు....’ అంటూ చెప్పిన కథనే మళ్లీ చెప్పాడు గురువుగారు.

ఈసారి కుర్రవాడికి చిరాకెత్తిపోయింది. ‘మీకేమన్నా పిచ్చా! చెప్పిన కథనే మళ్లీ చెబుతారేంటి. ఒకసారి విన్న కథని వెనువెంటనే మళ్లీ ఎలా ఆస్వాదించగలను,’ అంటూ చిరాకుపడ్డాడు.

కుర్రవాడి మాటలకు గురువుగారు చిరునవ్వుతో- ‘నాయనా ఒక చిన్న కథని మళ్లీ మూడోసారి వినడానికే ఇంత బాధపడుతున్నావే! నీ గతాన్ని అవతలివారు వందలసార్లు ఎందుకు వినాలి. నీ ఆరోపణలని పదే పదే ఎందుకు ఆలకించాలి. నీకు ఏదన్నా తప్పని తోస్తే ఖండించు, లేదా దాన్ని సరిదిద్దేందుకు నీకు తోచనిది చేయి. అంతేకానీ నిరంతరం నీకు కనిపించే ప్రతి చిన్న లోపాన్ని నీ భుజానికి ఎత్తుకొని ఎందుకు తిరుగుతున్నావు. నీ తోటివారికి కూడా ఆ బాధని రుద్దేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నావు. ఆ ప్రయత్నంలో నీ వ్యక్తిత్వాన్నే కోల్పోతున్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు,’ అని అడిగారు గురువుగారు.

గురువుగారి మాటలకు కుర్రవాడి దగ్గర జవాబు లేకపోయింది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.