ఉండవల్లి నోట తిరుగుబాటు మాట... జగన్ పై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా?

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మొదటిసారి మీడియా ముందుకొచ్చి ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే మొదట్నుంచీ సాఫ్ట్ కార్నర్ చూపించే ఉండవల్లి... పొంచివున్న ముప్పును సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గానే చెప్పేశారు. చరిత్రను గుర్తుచేస్తూమరీ హెచ్చరికలు చేశారు. 51శాతం ఓట్లు... 151 సీట్లు వచ్చాయని విర్రవీగొద్దని చెప్పకనే చెప్పారు. జాతీయ పార్టీల్లో నేతలకు తమ అసంతృప్తిని, ఆవేదనను చెప్పుకోవడానికి హైకమాండ్స్ ఉంటాయన్న ఉండవల్లి... వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు అన్నీ జగనేనని, అందువల్ల ఎమ్మెల్యేల మనసు గెలుచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి తామంటే నమ్మకముందనే విశ్వాసం ఎమ్మెల్యేల్లో కలిగించాలన్నారు. లేదంటే తిరుగుబాటు వచ్చే ప్రమాదముందని చరిత్రను తవ్వితీశారు. 1972లో పీవీ నర్సింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ 56శాతం ఓట్లు... 219 సీట్లు వచ్చాయని, కానీ పీవీని 9నెలల్లోనే దింపేశారని గుర్తుచేశారు. ఇక, 1984లో టీడీపీకి 54శాతం ఓట్లు... 213 సీట్లు వచ్చాయని, కానీ 9నెలల్లోనే ఎన్టీఆర్ కూడా కుర్చీ దిగాల్సి వచ్చిందనే విషయం మర్చిపోవద్దన్నారు. అయినా, ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరగబడతారని ఎవరైనా అనుకున్నారా? అన్న ఉండవల్లి... రాజకీయాల్లో ఊహించనవే జరిగే వీలుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉండవల్లి హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇప్పుడు జగన్ నైనా దింపేస్తారంటూ చరిత్రను గుర్తుచేస్తూ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడున్న 151మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని... ఇదే శాశ్వతమని భావించొద్దని జగన్ ను సూచించిన ఉండవల్లి.... ప్రజల్లో మంచి పేరుతోపాటు ఎమ్మెల్యేల మనసు కూడా గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోతే పీవీ నర్సింహరావు, ఎన్టీ రామారావుకి పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు. 

అయితే, ఉండవల్లి నోట తిరుగుబాట మాట అనే మాటలను చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. లేదంటే జగన్ పరిపాలనపై మొదటి మీడియా మీడియా సమావేశంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే మామూలు విషయం కాదు. ఏదో ఆషామాషీగా ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేయరు. తనకొచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకే ఉండవల్లి రియాక్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పదేపదే మీ ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉండాలంటూ ప్రస్తావించడం చూస్తుంటే.... మంత్రులు, ఎమ్మెల్యేలు... జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. ఏదిఏమైనా అధికారం శాశ్వతం కాదని, ఎమ్మెల్యేలు సంతోషంగా లేకపోతే... మీ వాళ్లే మీ మీద తిరగబడతారంటూ... జగన్ కు పొంచివున్న ముప్పుపై ఉండవల్లి హెచ్చరించారు.