ఉగాది పండుగే ఒక జీవితపాఠం!

 

మన పండుగలని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి- పూజలు, పిండివంటలతో హడావుడిగా సాగే భౌతికమైన ఆచారం, రెండు- ఆ పండుగ ద్వారా పెద్దలు మనకి చెప్పదలచిన జీవితసారం. మొదటి సందర్భాన్ని మనం పాటించినా పాటించకపోయినా రెండో సందర్భాన్ని మాత్రం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా ఉగాది నుంచి కూడా ఏమైనా మంచి విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తే, ఉగాది అణువణువూ ఏదో ఒక జీవితపాఠం కనిపిస్తూనే ఉంటుంది.

 

తైలాభ్యంగనం – ఉగాది రోజున లేవగానే నువ్వులనూనెతో స్నానం చేయాలని చెబుతారు పెద్దలు. ఒంటికి నువ్వులనూనెని పట్టించి, ఆపై సున్నిపిండితో నలుగుపెట్టుకుని స్నానం చేయడం వల్ల ప్రతి స్వేదరంథ్రమూ శుభ్రపడుతుంది. ఏ పండుగలో చేసినా చేయకున్నా ఉగాదినాడు మాత్రం ఈ ఆచారం పాటించితీరాలంటారు. ఉగాది మన సంవత్సరపు ఆరంభం కాబట్టి, ఆ రోజుని శుచిగా మొదలుపెట్టాలన్నది ఈ నియమం వెనుక సూచన కావచ్చు. శరీరం క్షణభంగురమే కావచ్చు! కానీ ఉన్న ఆ కాస్త కాలమూ దానిని ఆరోగ్యంగా, శుచిగా కాపాడుకోవాల్సిందే! మనసుని పరిశుద్ధంగా, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందే!

 

కాలమే దైవం – హిందువులకు ముక్కోటి దేవతలు ఉన్నారు. కానీ ఉగాది రోజున కాలమే దైవం. కొన్ని సందర్భాలలో కాలాన్ని కేవలం ‘సమయం’గా కాకుండా ఈ ప్రకృతిలోని సమన్వయాన్ని నెలకొల్పే శక్తిగా (రుతం) వేదాంతులు భావిస్తూ ఉంటారు. అంత లోతుల్లోకి వెళ్లకున్నా... జీవితంలో కాలం విలువని తెలియచేసే సందర్భంగా, కాలాన్ని విభజించే లెక్కగా ఉగాదిని చూడవచ్చు.

 

తీపిచేదుల కలయిక – జీవితమంటే కష్టసుఖాల కలయిక. వీటితో పాటు సంతోషం, కోపం, బాధ, వైరాగ్యం, గర్వం, వినయం... వంటి సవాలక్ష భావాలన్నీ మనిషిని పలకరిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ అదుపులో ఉంచుకోవాలని, ఎటువంటి ఒడిదొడుకులనైనా ఎదుర్కోవాలనీ సూచించేదే ఉగాది పచ్చడి. అందుకే పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అనే ఆరురుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినందే పండుగకి అర్థం లేదంటారు పెద్దలు.

 

పంచాంగ శ్రవణం – మన ప్రాచీనుల ఖగోళశాస్త్రానికి కాస్త నమ్మకాన్ని జోడిస్తే అదే పంచాంగం. రాబోయే సంవత్సరంలో రాజకీయం, వ్యవసాయం, వాతావరణం వంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న అంచనా ఎలాగూ ఉంటుంది! ఇక వ్యక్తిగతంగా ఆదాయవ్యయాలు, అవమానం రాజపూజ్యం వంటి వివరాలూ కనిపిస్తాయి. వీటిపట్ల నమ్మకం ఉన్నా లేకున్నా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలనీ, ఏ సందర్భంలోనూ వినయాన్ని కోల్పోకూడదనీ పెద్దల సూచనగా భావించవచ్చు.

 

పరోపకారం – ఉగాది రోజున చలివేంద్ర పెడితే బోలెడు పుణ్యమని చెబుతారు. అలా కుదరకున్నా కనీసం నీటితో నిండిన కుండని దానం చేయమన్నారు. ఇక ఉగాదినాడు చెప్పులు, గొడుగు దానం చేసినా విశేష ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఎండాకాలంలో తోటివారికి నీరు, చెప్పులు, గొడుగులు అందించడాన్ని మించిన సాయం ఏముటుంది! మన స్తోమతను అనుసరించి కాలానుగుణంగా తోటివారికి సాయపడేందుకు సిద్ధపడాలన్న ఆశయం ఈ ఆచారంలో కనిపిస్తుంది.    

- నిర్జర.