తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు? సంజయ్... లేదంటే అర్వింద్..?

తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు ఖాయమంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీకాలం త్వరలో ముగియనుండటంతో... కొత్త అధ్యక్షుడి ఎంపికపై జాతీయ నాయకత్వం దృష్టిపెట్టింది. సీనియర్లంతా లక్ష్మణ్‌ను మరోసారి కొనసాగించాలని ఒత్తిడి తెస్తున్నా, పార్టీలో రెండు ముఖ్య పదవులు హైదరాబాద్ వారికే కేటాయిస్తే జిల్లాల్లో పార్టీ నష్టపోతుందనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. 

హైదరాబాద్ నగరానికి చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగా, లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. దాంతో, హైదరాబాదేతర నాయకునికి పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఆలోచిస్తుందట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడినందున... కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, లేదా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్ల అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలకంటే, ఎంపీలే కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటంలో ముందుండటంతో, వారితోనే టీఆర్ఎస్‌ను ఢీకొట్టించడానికి జాతీయ పార్టీ సైతం ఆలోచిస్తోందని అంటున్నారు. భైంసా ఘటనలో బండి సంజయ్, ఇళ్ల కేటాయింపుపై ధర్మపురి అర్వింద్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.

అంతేకాదు, పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఎదగడానికి అవకాశమున్న తెలంగాణలో, దూకుడుగా ఉండే లీడర్‌కే పగ్గాలు అప్పగిస్తే, క్షేత్రస్థాయిలో, శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని లెక్కలు వేస్తోంది. మరోవైపు కొత్తవారికి, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పగ్గాలు వెళ్లకుండా, సీనియర్లు గట్టిగానే అడ్డుపడుతున్నట్టు చర్చ జరుగుతోంది. అందుకే కొత్త అధ్యక్షుడి ఎంపిక బీజేపీ హైకమాండ్‌కు కత్తిమీద సాములా మారిందంటున్నారు.