నాసా మెప్పు పొందిన  ఇద్దరు అమ్మాయిలు

అంగారక గ్రహానికి సమీపంలో ఆస్టరాయిడ్ గుర్తింపు

ఆకాశంలో చుక్కలు చూస్తూ వాటి లెక్క తెలియక చాలామంది తికమక పడుతుంటారు. కొందరు మాత్రమే ఆ చుక్కల లెక్కలు తేల్చాలని సంకల్పం చెప్పుకుంటారు. అలాంటి కోవలోకి చెందిన వారే సూరత్ లోని ఇద్దరు బాలికలు. 

 

ఈ ఇద్దరు అమ్మాయిలు అంగారక గ్రహానికి సమీపంగా ఉన్న గ్రహశకలాన్ని గుర్తించారు. వారు గుర్తించిన గ్రహశకలానికి నాసా హెచ్ఎల్ వీ 2514 (HLV2514)గా నామకరణం కూడా చేసింది. సూరత్ అమ్మాయిలేంటీ, నాసా నామకరణం ఎంటీ అంటూ తికమక పడుతున్నారా.. అసలు విషయం తెలిస్తే మీరు ఔరా ఎంత గొప్ప పనిచేశారు మన అమ్మాయిలు అని మెచ్చుకుంటారు.

 

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇద్దరు బాలికలు  వైదేహి వెకారియా సంజయ్‌భాయ్, రాధిక లఖాని ప్రఫుల్‌భాయ్. స్థానికంగా పిపి సవాని చైతన్య విద్యా సంస్థలో పదోతరగతి చదువుతున్నారు. ఇటీవల  రెండు నెలల పాటు ‘ఆల్‌ ఇండియా ఆస్టరాయిడ్‌ సెర్చ్‌ క్యాంపెయిన్‌ 2020’  క్యాంపెయిన్‌లో  వీరిద్దరూ పాల్గొన్నారు. టెక్సాస్‌లోని హార్డిన్ సిమన్స్ యూనివర్సిటీ సహకారంతో స్పేస్ ఇండియా, ఇంటర్నేషనల్ అస్ట్రానామికల్ సెర్చ్ కొలాబరేషన్(IASC)లు సంయుక్తంగా ఈ  క్యాంపెయిన్‌ను నిర్వహించాయి. 

 

భారతీయ విద్యలో ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రాలు ప్రాచుర్యం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్న స్పేస్ ఇండియా అనేక పాఠశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు ఎంపిక చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైదేహి, రాధిక హవాయిలోని పాన్‌‌స్టార్స్ (పనోరమిక్ సర్వే టెలిస్కోప్ & రాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్) అధునాతన టెలిస్కోప్ సాయంతో అంగారక గ్రహం సమీపంలో గ్రహశకలాన్ని గుర్తించారు. తాము కనిపెట్టిన ఈ కొత్త గ్రహశకలం చిత్రాలను తీయడానికి టెలిస్కోప్‌ను ఉపయోగించారు. ఈ టెలిస్కోప్ అధిక-స్థాయి సిసిడి కెమెరాలతో గ్రహశకలం చిత్రాలను తీస్తుంది. అంతరిక్షంలో ఉండే మందమైన వస్తువులను ఈ టెలిస్కోప్ గుర్తిస్తుంది.

 

'దాదాపు 20ఆబ్జక్ట్స్ ను జాగ్రత్తగా పరిశీలించాం. అందులో ఒకటి గ్రహశకలంగా గుర్తించబడింది'. అంటున్నారు ఈ ఇద్దరు అమ్మాయిలు. వారిద్దరూ గ్రహశకలాన్ని కనుగొన్నారనే  విషయాన్ని  నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) నే ప్రకటించింది. అంతేకాదు  ఈ గ్రహశకలానికిHLV2514 గా నామకరణం చేసింది. ఈ సరికొత్త గ్రహశకలం సమీప భవిష్యత్తులో భూమిని దాటే అవకాశం ఉందని,  అయితే దీనికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు  అని గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది.