కేసీఆర్ సర్కార్ మీద కేంద్రం నజర్....వయా టీవీ9 ?

 

తెలంగాణలో తమకు తిరుగులేదు, తాము చెప్పిందే వేదం అనుకుని రాజకీయం చేస్తున్న కేసీఆర్ అండ్ కోకి చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దం అయ్యిందా ? అంటే అవుననే అనిపిస్తోంది తాజాగా జరుగుతున్న పరిణామాలు. కేసీఆర్, జగన్ ల మధ్య దోస్తీ రహస్యం ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. అయితే కేంద్రం మాత్రం కేసీఆర్ ను నమ్మినట్లే నమ్మి సమయం కోసం వేచి చూసింది కార్యాచరణ మొదలుపెట్టిందని తెలంగాణాలో కేసీఆర్ ప్రభ అంతం చేయడానికి పూనుకుందని అంటున్నారు. 

ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ కి ఊపిరి ఆడనివ్వడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రజలకు ఏదో చేసేశామని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ప్రచారం చేసినట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని కేంద్రానికి నివేదికలు వెళ్లాయి. అసలే ఎప్పుడు ఎంటర్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేద్దామా అని గోతికాడ నక్కల్లా కాచుకుని ఉన్న బీజేపీ నేతలు ఈ అవకాశాన్ని వదులుకోడానికి సిద్దంగా లేక తాజాగా ఐటీ దాడులు మొదలు పెట్టారు. 

హైదరాబాద్‌లో మై హోం రామేశ్వర రావు ఇల్లు, కార్యాలయాలపై నిన్నన  ఉదయం 7 గంటల నుంచి ఐటీ అధికారులు దాడులు చేశారు. నంది నగర్‌లోని ఆయన నివాసం, హైటెక్ సిటీలో ఉన్న ఆఫీసుల్లో సుమారు 200 మంది అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. చానెళ్ళ మీద చానెళ్ళు కొంటూ మీడియా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని కేసీఆర్ అండతో భూదందా చేసి వేలకోట్ల ఆస్తులు కూడగట్టి పెద్ద మాఫియాగా తయారైన రామేశ్వరావుకి అవేమీ కాకుండా అనవసరంగా కావాలని కొన్న లావాదేవీలు మెడకు చుట్టుకొని కేంద్రానికి అదే ఆయుధంగా మారింది. 

అదీకాక మై హోమ్ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర రావు టీఆర్‌ఎస్ పార్టీకి ఇటీవల రూ.3000 కోట్ల ధనాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి రామేశ్వర రావుతో పాటు మరో వ్యాపారవేత్త శ్రీనిరాజు హైదరాబాద్ శివార్లలో 100 ఎకరాల భూమిని 20% శాతం ధరకే దక్కించుకున్నట్లు కూడా మరో ప్రచారం జరుగుతోంది. రైతులకు చెందిన భూములను ఉదారంగా కట్టబెట్టినట్లు కొంత మంది ఆరోపిస్తున్నారు. 

అయితే నిన్నజరిగిన సోదా మాత్రం టీవీ9 సంస్థలోకి హవాలా మార్గం ద్వారా రామేశ్వర రావు రూ.220 కోట్లను తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అని అంటున్నారు. టీవీ9 సంస్థను రామేశ్వర రావు స్వాధీనం చేసుకోవడం, ఛానెల్ నుంచి రవిప్రకాశ్‌ను తప్పించడం వెనుక తెలంగాణ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే రవి ప్రకాష్ ఇటీవల ఢిల్లీలో అమిత్ షాను కలిసినట్లు వస్తున్న వార్తలు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి.