పసుపుతో మతిమరుపు మాయం

ప్రతి ఇంట్లో పసుపు తప్పని సరిగా ఉంటుంది. కూరల్లో రంగు కోసం తప్పని సరిగా వాడే పసుపు యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మన పెద్దవారు గాయమైనా, జబులైనా పసుపుతో నయం చేసేవారు. ఆడపిల్లలకు నెలసరి సమయంలో చిన్న పసుపు ముద్ద మింగమని చెప్పేవారు. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ ఫెక్షన్స్ ను నివారించడంతో దీనికి ఇదే సాటి.  పురాతన కాలం నుంచి మన సంప్రదాయంలో, ఆహారపు అలవాట్లలో భాగమైన పసుపు వల్ల కలిగే లాభాలపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరగుతున్నాయి. ఆశ్చర్యకరమైన అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

పసుపు మెదడు పనితీరుపై ఏ విధమైన ప్రభావం చూపిస్తోందో తెలుసుకోవడానికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెల్స్  శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. 50 నుంచి 90ఏండ్ల మధ్య వయసు ఉన్న వారికి  ఆహారంలో ప్రతిరోజూ 90మిల్లీగ్రాముల పసుపు ఇచ్చారు. ఆరునెలలకు ఒకసారి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 18నెలల తర్వాత వారిలో జ్ఞాపకశక్తి పెరగడాన్ని గమనించారు. పసుపు రక్తంలో కలిసి మెదడుకు చేరి కణాలను ఉత్తేజం చేస్తుందని తెలుసుకున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మతిమరుపును దూరం చేస్తుందని గమనించారు. దాంతో పసుపు మతిమరుపుతో బాధపడేవారికి ఒక వరం అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అల్జీమర్స్  వ్యాధి నివారణలో పసుపు వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధనలతో స్పష్టమైంది. ఈ పరిశోధన వల్ల పసుపు గొప్పదనం మరోసారి రుజువైంది.