'తుంగభద్ర' రివ్యూ




తారాగణం: అదిత్, డింపుల్, సత్యరాజ్‌, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, సప్తగిరి, రాజేశ్వరి నాయర్‌, ధన్‌రాజ్‌, నవీన్‌, రవివర్మ, చరణ్‌, శశాంక్‌ తదితరులు, నిర్మాత.. సాయి కొర్రపాటి, డైరెక్టర్.. శ్రీనివాస కృష్ణ
 
నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలనచిత్రం బేనర్లో నిర్మించిన కొత్త చిత్రం తుంగభద్ర. ఈగ, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య లాంటి పలు హిట్ చిత్రాలు ఈయన నిర్మాణంలో వారాహి బేనర్ నుండి వచ్చినవే. అయితే వరుస హిట్ చిత్రాలు అందించిన ఈ బ్యానర్ నుండి వచ్చిన చిత్రం కాబట్టే తుంగభద్రపై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలే ప్రేక్షకులని థియేటర్ల వైపు నడిపించేలా చేశాయి. రాజకీయాలు, ఫ్యాక్షన్ గొడవల మధ్య ఓ చిన్న ప్రేమకథను జోడించి తుంగభద్ర చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చిందా, సాయి కొర్రపాటిపై ప్రేక్షకులు పెట్టుకొన్ననమ్మకాన్నినిలబెట్టుకోగలిగాడా లేదా చూద్దాం. 

ఇక కథలోకి వెళదాం..
రామరాజు (సత్యరాజ్), త్రిమూర్తులు(చలపతిరావు) తాడికొండ నియోజకవర్గంలో పొలిటికల్ లీడర్లు. ఈ ఇద్దరి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే ఈ పొలిటికల్ ఫ్యాక్షన్ గొడవల వల్ల రామరాజు చేతిలో త్రిమూర్తులు ప్రాణాలు కోల్పోతాడు. త్రిమూర్తులు కొడుకులు తమ తండ్రిని చంపిన రామరాజును చంపి పగ తీర్చుకొవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి అదను చూసి దాడి చేస్తారు. కానీ ఈ దాడిలో రామరాజు అనుచరులు తమ ప్రాణాలు అడ్డువేసి రామరాజుని కాపాడుతారు. ఆ చనిపోయిన అనుచరుల్లో ఒకడి కొడుకే హీరో శ్రీను (అదిత్). తమ తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి రామరాజుకు అనుచరుడిగా వచ్చిన శ్రీను రామరాజు కూతురి ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలిసిన రామరాజు ఎలా రియాక్ట్ అయ్యాడు? తరువాత పరిస్థితులను శ్రీను ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ.

ఫెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.... ఈ సినిమాలో ముందుగా సత్యరాజ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. నాయకుడు పాత్రలో ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. సినిమా మొత్తానికి ఆయన ఫెర్ఫార్మెన్స్ హైలెట్. హీరో అదిత్ అంతా గొప్పగా చేయలేకపోయినప్పటికీ పర్వాలేదనిపించాడు. హీరోయిన్ డింపుల్ తన శక్తి మేరకు బానే చేసింది. అయితే ఇంతకు ముందు సినిమాల్లో కామెడీ పండించిన సప్తగిరి మాత్రం ఈసారి ఎక్కువ నవ్వించలేకపోయాడు. జబర్దస్త్ శ్రీను, నవీన్, ధనరాజ్ ఉన్నంతలో అక్కడక్కడా కామెడీ చేశారు. పైడితల్లి పాత్రలో కోట శ్రీనివాసరావు ఎప్పటిలాగే తన సహజనటనతో మెప్పించారు. టెక్నికల్ గా రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ బావుంది.  హరిహర అందించిన సంగీతం కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. స్క్రీన్ ప్లే కూడా అంత చెప్పుకోదగిన విధంగా ఏమీ లేదు. సినిమాలో ఇటు ఫ్యాక్షన్ అంశాలను, అటు ప్రేమకథను ఆసక్తికరంగా చూపడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హీరో, దర్శకుడి గురించి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకపోయినా వారాహి చలన చిత్రం దృష్టిలో పెట్టుకొని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడు నిరాశకు గురయ్యాడు.