విశాఖలో జగన్ కు 32వేల ఎకరాలు..? త్వరలో ఆధారాలు...!

ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో 32వేల ఎకరాల భూమి ఉందంటూ ఆరోపణలు చేశారు. బినామీల పేరుతో జగన్మోహన్ రెడ్డి... ఈ భూములు కొనుగోలు చేశారని అన్నారు. ఆ భూముల విలువ పెంచుకోవడానికే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చారని తులసిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బినామీ పేర్లతో ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేసిన భూముల వివరాలను త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని అన్నారు.

వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే జగన్ ఈ భూములను కొనుగోలు చేశారని తులసిరెడ్డి అన్నారు. విశాఖతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ఆస్తులను జగన్ కూడబెట్టుకున్నారని, ఆ భూములపై ప్రేమతోనే రాజధానిని మార్చుతున్నారే తప్ప... ఉత్తరాంధ్రపై ప్రేమతో కాదని అన్నారు. అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పుంటే... వైసీపీకి కనీసం 20 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. ఇప్పుడైనాసరే, జగన్మోహన్ రెడ్డి నిజంగా మొనగాడయితే... అసెంబ్లీని రద్దుచేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసిరారు. లేకపోతే మోసగాడిగానే మిగిలిపోతారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.