నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు

 

రాజకీయాల్లో ఎమ్మెల్యే టికెట్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.అయితే ఓ నేత మాత్రం ఇచ్చిన టికెట్ నే వద్దు అంటున్నారు.అసలు టికెట్ రావటమే కష్టం అలాంటిది ఎందుకు వద్దు అంటున్నాడో తెలుసా అడిగిన దగ్గర టికెట్ ఇవ్వకుండా వేరే దగ్గర టికెట్ కేటాయించనందుకు.గత కొంతకాలంగా ఎల్బీనగర్ స్థానంపై తెదేపా పట్టుపడుతుంది.ఆ పార్టీనేత సామ రంగారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశించి.. ప్రచారం కూడా ప్రారంభించారు. అధికారికంగా ఈ స్థానం ఎవరికి కేటాయిస్తారన్నది ప్రకటించకపోయినా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సుధీర్‌రెడ్డి తనకే టికెట్టు వస్తుందని ప్రచారం చేసుకొంటున్నారు. దీంతో కలత చెందిన సామ రంగారెడ్డి అనుచరులు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు పెద్దఎత్తున వచ్చి ఆందోళన చేశారు.

అనూహ్యంగా ఇబ్రహీంపట్నం తెదేపాకు కేటాయించారని అక్కడి నుంచి సామ రంగారెడ్డి పోటీ చేస్తారని తెదేపా ప్రకటన విడుదల చేసింది.ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తే ఆయనకు ఇబ్రహీంపట్నంలో అవకాశం కల్పించడం ఏమిటన్న చర్చ పెద్దఎత్తున సాగుతోంది.ఇప్పటికే ఇబ్రహీంపట్నం టికెట్ జాప్యంపై కాంగ్రెస్ పార్టీ నేత క్యామ మల్లేష్‌ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కానీ టికెట్ రంగారెడ్డికి కేటాయించటంతో కాంగ్రెస్‌ నేత మల్‌ రెడ్డి రంగారెడ్డి,డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌లు తీవ్రంగా రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో మల్‌రెడ్డి ఉన్నట్లుగా తెలిసింది. అవసరమైతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగుతానని అనుచరులతో చెప్పినట్లు సమాచారం.

కాగా దీనిపై స్పందించిన రంగారెడ్డి... ఎల్బీనగర్‌ టికెట్ కావాలని కోరానని,  అందుకు విరుద్ధంగా ఇబ్రహీంపట్నం ఇచ్చారని వాపోయారు.11 ఏళ్ల నుంచి ఎల్బీనగర్‌లో పార్టీని పటిష్టానికి ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు వేరే నియోజకవర్గానికి మారమని చెప్పడంలో ఆంతర్యం అర్థం కావడం లేదన్నారు. ప్రకటన వచ్చే వరకు ఈ విషయం తనకు తెలియదన్నారు.ఎల్బీనగర్‌లో ఏ వార్డులోనూ కాంగ్రెస్‌కు తెదేపా కంటే ఆధిక్యం రాదని అన్నారు.

ఇబ్రహీంపట్నం టికెట్‌ తనకు రావడంతో కాంగ్రెస్‌ నేత మల్‌ రెడ్డి రంగారెడ్డి తన వద్దకు వచ్చి మంతనాలు జరిపారని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ ఎందుకు తనకు ఇచ్చారని మల్‌రెడ్డి ప్రశ్నించారని తెలిపారు. దమ్మూ, ధైర్యం లేని నేతల వద్ద పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.అధ్యక్షుడు ఎల్‌.రమణకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తోందని చెప్పారు.దీనిపై చర్చించేందుకు తాజాగా రంగారెడ్డి అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయ్యారు.ఎల్బీనగర్‌ టికెట్ కావాలని కోరారు.ఒకవేళ ఇబ్రహీంపట్నంలో పోటీ చేసినా రంగారెడ్డి సహకరించకుంటే తన పరిస్థితేంటని ఆయన అధినేతను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అందరితో చర్చిద్దామని చెప్పినట్లుగా సమాచారం.